హైదరాబాద్‌ను పాలించిన నిజాం కుటుంబంలో ఎనిమిదో నిజాం రాజు ముకర్రం జా బహదూర్ అని పిలువబడే మీర్ బర్కెట్ అలీ ఖాన్ మృతి చెందారు. 89 ఏళ్ల వయస్సున్న ముకర్రం జా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్టు నిజాం కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ వారసుడు, మనవడు అయిన జా టర్కీలో నివసిస్తున్నారు.
కాగా.. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ నెల 17వ తేదీన కుటుంబ సభ్యులు ముకర్రం జా భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అవసరమైన ఆచార వ్యవహారాలను పూర్తి చేసిన తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన స్వదేశంలోనే అంత్యక్రియలు జరగాలన్నది జా చివరి కోరిక అని, అందుకే ఈ నెల 17న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆయన పిల్లలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. “హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ గత రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో రాత్రి 10.30 గంటలకు ప్రశాంతంగా మరణించారని మీకు తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం.” అని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.
1933 అక్టోబర్ 6 న ఫ్రాన్సులో ఒట్టోమన్ సామ్రాజ్యపు యువరాజు ఆజం జా, యువరాణి దుర్రు షెహ్వార్‌లకు జా జన్మించారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఏప్రిల్ 6, 1967న ఎనిమిదవ అసఫ్ జాగా పట్టాభిషేకం చేశారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
రాజా సాబ్ చిత్రం టికెట్ ధరల పెంపు జీవో కొట్టివేత