అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆగిపోయిన విమానాలు

కంప్యూటర్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అమెరికాలో అసాధారణ రీతిలో బుధవారం పూర్తి స్థాయిలో విమాన రాకపోకలలో అంతరాయం ఏర్పడింది. దేశీయంగా నడిచే అంతర్గత విమాన సర్వీసులన్నింటిని నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు 5,000 విమానాలు ఆలస్యంగా నడవగా, 900 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

అమెరికా వ్యాప్తంగా  ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. అయితే క్రమంగా విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు కాశారు. సైబర్‌ దాడుల కారణంగా ఇది జరిగిందని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఖండిండారు.

ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఓ వైపు మంచుతుఫాన్లతో చాలా రోజులుగా నిలిచిన ప్రయాణాలకు తోడుగా ఇప్పుడు సాంకేతిక లోపాలతో విమానాలకు బ్రేక్‌లు పడటంతో వేలాది మంది ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. విమాన ప్రమాదాల గురించి పైలట్‌లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరించే ‘ఎయిర్ మిషన్ల నోటీసు’ వ్యవస్థ విఫలమైనట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) తెలిపింది.

దీని వల్ల అమెరికా వ్యాప్తంగా గగనతలం వ్యవస్థ ప్రభావితమైనట్లు పేర్కొంది. ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించింది. విమానాశ్రయంలో సేవలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని వెల్లడించింది. ఎయిర్ మిషన్ల నోటీసు వ్యవస్థలో సాంకేతిక సమస్య వల్ల అమెరికా వ్యాప్తంగా సుమారు 760 విమానాలపై ప్రభావం పడింది. ఆ దేశం నుంచి బయటకు వెళ్లే, దేశంలోకి వచ్చే విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లైట్‌ఎవేర్‌ పేర్కొంది.

ఎయిర్‌పోర్టుల్లో ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోవడం, విమానాల రాకపోకల్లో ఆలస్యం వల్ల అమెరికా వ్యాప్తంగా విమాన ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు.  దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి దిగ్భ్రాంతికర పరిస్థితి ఏర్పడలేదని వైమానిక నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన ఉదంతం బహూశా 9/11 దాడుల దశలో నెలకొని ఉంటుందని, ఇప్పటి పరిణామం నమ్మశక్యం కాని విఘాతంగా మారుతోందని వ్యాఖ్యానించారు. నమ్మలేని ఈ అంతరాయం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు.

ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)లో తలెత్తిన సాంకేతిక లోపం పరిస్థితులను అమెరికా రవాణాశాఖ మంత్రి  ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారని శ్వేత సౌధం వెల్లడించింది. సైబర్‌ దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అయితే, దీని వెనుక కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించినట్టు శ్వేత సౌధం ప్రెస్‌ కార్యదర్శి ట్విటర్‌లో తెలిపారు.