అర్ష్‌దల్లాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

అర్ష్‌దల్లాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది.  ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు అర్ష్‌దీప్‌ దల్లా టెర్రర్‌ మాడ్యూల్‌ను నడుపుతున్నాడు.
దల్లా కేటీఎఫ్‌ కెనడాకు చెందిన చీఫ్‌ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు సన్నిహితుడు. అర్ష్‌దల్లా పంజాబ్‌తో పాటు విదేశీల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. పంజాబ్‌లో జరిగిన పలు హత్యల్లోనూ ప్రమేయం ఉన్నట్లు తేలింది. పాక్‌ నుంచి ఆర్డీఎక్స్‌, ఐఈడీ, ఏకే-47, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాకు సంబంధించిన కేసుల్లోనూ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం అతన్ని కెనడా నుంచి రప్పించే ప్రయత్నాలు జరుగుతుండగా, త్వరలోనే భారత్‌కు తీసుకురానున్నారు. గతేడాది మేలో రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. ఇదిలా ఉండగా  హోంశాఖ మంత్రి అమిత్‌షా జమ్మూకశ్మీర్‌ నేతలతో సోమవారం రాత్రి  ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయి, రాజకీయ, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించిన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరో వైపు గత శనివారం హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ ఆసిఫ్‌ మక్బూల్‌ దార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. 7న కేంద్రం పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ తో పాటు దాని సమూహాలన్నింటిని ఉగ్రవాదసంస్థలుగా ప్రకటించింది. అలాగే టీఆర్ఎఫ్‌పై సైతం నిషేధం విధించింది. టీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ షేక్ సజ్జాద్ గుల్‌, లష్కర్ కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.