ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల రిమాండ్ పొడిగింపు

రాజకీయ దుమారం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టు ఆదేశాలిచ్చింది. కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న నిందితులు శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబుల కస్టడీ శనివారంతో ముగియడంతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా వారిని కోర్టులో హాజరుపరిచారు.

మనీ లాండరింగ్ అభియోగాలపై ఈ నలుగురితో పాటు అమిత్ అరోరా, మరో 7 కంపెనీలపై ఈడీ శుక్రవారం సాయంత్రమే 2వ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు విచారణ జరపాల్సిన నేపథ్యంలో నిందితుల కస్టడీని జనవరి 28కు వాయిదా వేస్తున్నట్లు స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ ప్రకటించారు.

అలాగే చార్జిషీటును పరిగణలోకి తీసుకునే అంశంపై అదే రోజు విచారణ జరపనున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుపై గత ఏడాది నవంబర్ 25న ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలి చార్జిషీటులో సమీర్ మహేంద్రుతో పాటు ఆయనకు సంబంధించిన 4 కంపెనీలను నిందితులుగా ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రెండవ చార్జిషీటులో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరాతో పాటు 7 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు, 11 కంపెనీలపై చార్జిషీట్ దాఖలు చేసినట్టయింది.  రెండవ చార్జిషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత అందులోని నిందితులకు చార్జిషీటు కాపీలను అందజేయనున్నట్టు స్పెషల్ కోర్టు వెల్లడించింది. అప్పటి వరకు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.