అబద్దంతో హైకోర్టుకు హాజరుకాక అడ్డంగా పట్టుబడ్డ అధికారి 

మంచం కూడా దిగలేనంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందువల్ల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానంటూ గురువారం విచారణకు గైర్హాజరమైన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కె.సంతోష రావు శుక్రవారం హైకోర్టుకు పట్టుబడ్డారు. 
 
సంతోషరావు గురువారం ఎక్కడ ఉన్నారంటూ శుక్రవారం ఓ కేసులో కోర్టు ముందు హాజరైన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) కె.విజయానంద్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించడంతో అబద్దం ఆడినట్లు వెల్లడైంది. 
 
 ‘సంతోష రావుకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి గురువారం ఎక్కడున్నారో  కనుక్కోండి’ అని విజయానంద్ ను ఆదేశించారు. దీనికి విజయానంద్ స్పందిస్తూ గురువారం ఏలూరులో సమీక్షలో తనతో పాటు పాల్గొన్నారని చెప్పారు. మంచం దిగలేనంత అనారోగ్యంతో బాధప డుతున్నానని ఆయన న్యాయవాది ద్వారా కోర్టుకు చెప్పించారు కదా? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. 
 
అధికారులు అబద్ధాలతో కోర్టులను మోసం చేస్తున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోషరావుపై సుమోటో కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ దేవానంద్ ఆదేశించారు. కేసు విచారణకు 20 నాటికి వాయిదా వేశారు. 
మరో కేసులో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడమే కాక కోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సయ్యద్ అబ్దుల్ కరీంపై కూడా సుమోటో కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీని ఆదేశించారు.  ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.  విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు.
అబ్దుల్ కరీంపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటానని కోర్టు ముందు హాజరైన ఇందనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ హామీ ఇచ్చారు.
కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కిందిస్థాయి సిబ్బందికి మరోసారి ఆదేశాలిస్తామని ఆయనతో పాటు సీపీడీసీఎల్ చైర్మన్ పద్మా జనార్దన్ రెడ్డి, ఎస్ఈ కూడా హైకోర్టుకు తెలిపారు. వీరు చెప్పిన వివరాలను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.
ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరికి తదుపరి విచారణలో వ్యక్తి గత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. అయితే, అబ్దుల్ కరీంకు మినహాయింపునిచ్చేందుకు నిరాకరించారు.