
తిరుమలలో ఆధునికీకరణ పనులు చేపట్టి, మళ్లీ అందుబాటులోకి వచ్చిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దెను టిటిడి భారీగా పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. రూ.500, రూ.600 నుంచి రూ.1000కు వరకు ఆయా గదులను బట్టి ధర పెరిగింది.
ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. అలాగే కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దె జీఎస్టీతో కలిపి రూ.2800కు పెరిగింది.
ఇక గది అద్దెతో పాటు అంతే మొత్తం నగదు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని కొత్త ప్రతిపాదన కూడా పెట్టింది టీటీడీ. అంటే 1700రూపాయల గది అద్దెకు కావాలంటే అడ్వాన్స్‌తో కలిపి 3400చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వామి భక్తులను నిలువు దోపిడీ చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. జనవరి 1వ తేది నుంచి పెంచిన ధరలు వసూలు చేస్తుండటం విశేషం. మరోవంక, రూ.50 అద్దెతో లభించే ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, హెచ్‌వీసీ, ఏఎన్‌సీ.. రూ.100 అద్దెతో అందించే సప్తగిరి, వరాహస్వామి గెస్ట్‌హౌస్, రాంభగీచా, ఎస్‌ఎన్‌జీహెచ్, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీఅతిథిగృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తున్నారు.
దానితో, వీటి అద్దెలు కూడా పెంచుతారా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. తిరుమలలో వసతి కేంద్రాలను రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేశారు. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచారు.
ముఖ్యంగా సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యంస కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉండేవారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600రూపాయలు వసూలు చేసే వాళ్లు. కాని ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు చేశారు.
అయితే వసతి గృహాల అద్దె రేట్లను పెంచడంపై టీటీడీ పాలక మండలి వివరణ ఇచ్చింది. భక్తుల నుంచి వస్తున్న నిరసనలు, అసహనానికి చింతిస్తున్నట్లు తెలిపుతూనే తిరుమలలో ఉన్న 6వేల గదుల్లో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. దీనికి 110కోట్ల రూపాయలతో టెండర్లు ఆహ్వానించింది. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తుండటం వల్లే అద్దెలు పెంచాల్సి వచ్చిందని వివరణ ఇస్తోంది.
ఇవే కాదు సామాన్య భక్తులు బస చేసే 50, 100రూపాయలకు లభించే గదుల అద్దెను కూడా త్వరలోనే పెంచుతామని ప్రకటించింది.వాటిల్లో కూడా ఆధునీకరణ పనులు పూర్తి చేసిన తర్వాత పెంచబోతున్నట్లుగా ముందుగానే టీటీడీ పాలకమండలి వెల్లడించింది.
మరోవైపు జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి కోటా (ఫిబ్రవరి 1 నుంచి 22)కు సంబంధించి టికెట్లను టిటిడి విడుదల చేయనుంది.
అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను ఈ నెల 7న ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ ప్రత్యేక దర్శన స్లాట్లకు సంబంధించిన గదుల బుకింగ్ ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 2 నుంచి 11 వరకు అందుకు సంబంధించిన టికెట్లు టిటిడి జారీ చేసింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు