జీ-20 సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ పర్యాటకులపై దృష్టి

జి20 అధ్యక్ష పదవి చేబడుతున్న భారత్ ఈ సంవత్సరం ఆతిధ్యమివ్వనున్న పలు అంతర్జాతీయ సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు.
 
ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న భారతదేశం అందుకు తగ్గట్లుగానే ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వెడుతున్న సందర్భంగా తన పరిధిలోని మూడు శాఖలతో సన్నాహాలు గురించి సమీక్ష జరిపారు.  ఈ సమావేశానికి జీ-20 షెర్పా అమితాబ్ కాంత్, జీ-20 సెక్రటేరియట్ అధికారులు, మూడు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
సమీక్ష సమావేశంలో భాగంగా జీ-20 దేశాల ప్రతినిధులు, అధికారులు పాల్గొనే వర్కింగ్ గ్రూప్స్ సమావేశాలు జరిగే ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, ఆ కేంద్రాల వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి, జీ-20 షెర్పాకు వివరించారు.అటు పర్యాటక శాఖ అధికారులు కూడా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగే ప్రాంతాల్లో అతిథుల కోసం చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జీ-20 సమావేశాల మొదటి విడత కార్యక్రమాలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దిశగా చేపడుతున్న ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు కూడా తమ రాష్ట్రాల్లో సన్నద్ధతను సమావేశంలో వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, అక్కడి సాంస్కృతిక వైవిధ్యతకు అవసరమైన గుర్తింపును అందించేందుకు జీ-20 సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ప్రజల భాగస్వామ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఆధునిక వసతులతోపాటు, ప్రతి చోటా భారతీయత ప్రతిబింబించేలా కార్యక్రమాలుండాలని ఆయన సూచించారు.