జనసేన-బీజేపీ పొత్తును బలహీన పరిచేందుకే ఏపీలో బీఆర్ఎస్

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తును బలహీన పర్చేందుకే బీఆర్ఎస్ రూపంలో సీఎం కేసీఆర్ ఏపీరాజకీయాలలోకి అడుగుపెట్టారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసగించినట్లుగానే.. ఏపీ ప్రజలను కూడా నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
 
ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఓ సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన విషయాలు ఏపీ ప్రజలకు కూడా తెలుసని ఆమె స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆమె హెచ్చరించారు.
 
ఏపీలో జనసేన, బీజేపీని నష్టపరిచే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, ఏపీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ సంకేతాలు ఇవ్వడం వెనుక కారణం అదేనని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.  ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గురించి ఏపీ ప్రజలకు బాగా తెలుసని ఆమె ఎద్దేవా చేశారు.
 
కేసీఆర్‌ ఏపీ రాకను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తారని విజయశాంతి భరోసా వ్యక్తం చేశారు.   కాగా,  ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీని వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఏపీలో కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని, బీఆర్ఎస్ పార్టీ ఏపీకి రావడం మంచి పరిణామం అని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదని వైసీపీ నేతలు చెబుతున్నారు.