ప్రయాణికుల కార్ల విక్రయాల్లో 2022 సరికొత్త రికార్డు నమోదు చేసింది. కరోనా ముప్పు తీవ్రత, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ప్రత్యేకించి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)లకు గిరాకీ పెరిగింది. 2022లో 37.93 లక్షల యూనిట్ల కార్ల అమ్మకాలు రికార్డయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ అని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
కాగా, 2022లో మారుతి సుజుకి, హ్యుండాయ్, టాటా మోటార్స్ కార్లకు డిమాండ్ ఎక్కువ. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఇండియా కార్లు కూడా రికార్డు సేల్స్ నమోదు చేసుకున్నాయి. 2021లో 30.82 లక్షల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2022 కార్ల విక్రయాలు ఒక ఏడాదిలో అత్యధికం అని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఇంతకుముందు 2018లో 33.3 లక్షల కార్లు అమ్ముడు పోయాయి. 2018 సేల్స్‌తో పోలిస్తే 2022లో సుమారు 14 శాతం ఎక్కువ కార్లు విక్రయించామని వివరించారు. కరోనా సవాళ్లు తగ్గుముఖం పట్టడంతోపాటు కార్లకు గిరాకీ పెరగడం కూడా సేల్స్ ఎక్కువ కావడానికి కారణం అని శశాంక్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. మూడేండ్లుగా కార్ల విక్రయాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు.
మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీలు 43.2 శాతం ఉండగా రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ గల కార్లు 40 శాతం అమ్ముడయ్యాయి. 2022లో మారుతి సుజుకి 15.76 లక్షల కార్లు (2021లో 13.64 లక్షల యూనిట్లు) విక్రయించామని, ఇది 16 శాతం ఎక్కువ అని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ ఇండియా 2021లో కార్ల సేల్స్ 5,05,033 యూనిట్ల నుంచి 2022లో 5,52,511 యూనిట్లకు పెరిగాయి. ఇది 9.4 శాతం వృద్ధి. మొత్తం సేల్స్‌లో సగం ఎస్‌యూవీ కార్లదే వాటా అని హ్యుండాయ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ వెల్లడించారు.దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్రా స్పందిస్తూ 2022 కార్ల విక్రయాల్లో గత రికార్డులను మించి వృద్ధి నమోదైందన్నారు. ఐదు లక్షల యూనిట్ల మైలురాయిని దాటిందని చెప్పారు. టయోటా కార్ల విక్రయాలు 23 శాతం వృద్ధితో 1,30,768 కార్ల నుంచి 1,60,357 యూనిట్లకు పెరిగాయి. గత పదేండ్లలో ఇదే అత్యధికం అని టయోటా కిర్లోస్కర్ పేర్కొంది. స్కోడా ఆటో ఇండియా సైతం రెండింతలు సేల్స్ పెరిగాయని వెల్లడించింది. 2021లో 23,858 యూనిట్లు విక్రయిస్తే, గతేడాది 53,721 కార్లు అమ్ముడయ్యాయని స్కోడా తెలిపింది.
More Stories
ఆప్ నేతలపై రూ. 2,000 కోట్ల అక్రమాలు జరిపినట్లు కేసు
మెహుల్ ఛోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ
ఇక వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించలేరు!