ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులపై ఆంక్షలు పెరుగుతుండడం పట్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే తాలిబన్ పాలకులు ఆ ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. ఆరవ గ్రేడ్‌కు మించి ఆడపిల్లలు చదువుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించడాన్ని భద్రతా మండలి ఖండించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు పూర్తి స్థాయిలో సమానమైన, అర్ధవంతమైన ప్రాతినిధ్యం వుండాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల తరపున మహిళలు పని చేయకుండా నిషేధించే నిర్ణయం వల్ల తీవ్ర పర్యవసానాలు వుంటాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ వోకర్ తుర్క్ పేర్కొన్నారు.
ఎన్‌జిఓ కార్యకలాపాల్లో కూడా మహిళలు పాల్గనరాదంటూ గత శనివారం నాడు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆఫ్ఘన్‌లో కార్యకలాపాలను ఇప్పటికే నాలుగు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు నిలుపు చేశాయి. జనాభాలో సగమైన మహిళలను ఇలా మినహాయించడం వల్ల ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి పోతుందని, నిజానికి మనుగడే సాగించలేదని తుర్క్ జెనీవాలో ఒక ప్రకటన చేశారు.
కేవలం మహిళలే కాదని, దీనివల్ల మొత్తంగా ఆఫ్ఘన్ల ఇబ్బందులు పెరుగుతాయని తెలిపారు. ఈ నిషేధానిు ఎత్తి వేయకపోతే కీలక సేవలు అందడం ఆగిపోతుందని, వాటిపై అనేకమంది ఆఫ్ఘన్లు ఆధారపడి వున్నారని పేర్కొన్నారు.

More Stories
భారత్ – ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
బంగ్లాలో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూసివేత
కునార్ నదిపై భారీ ప్రాజెక్టుతో పాక్ కు తాలిబన్ల దెబ్బ