అనేక దాడులను ఎదుర్కొని నిలబడ్డ హిందూ ధర్మం శ్రేష్టం

హిందూ ధర్మం శాశ్వతమైనదని, మొగలాయిలు, క్రిస్టియన్ల నుంచి అనేక దాడులు దౌర్జన్యాలు ఎదుర్కొని నిలబడిందని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి  గుమ్మల సత్యం తెలిపారు. కులాలు పక్కన పెడితేనే హిందువులు సంఘటితమవుతారని, మనుషుల్లో అంతరాలు దూరమవుతాయని చెప్పారు. 
 
 విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ రెండు రోజుల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ హిందూ సమాజం శ్రేష్టమైనదని, దానిని కలుషితం చేసేటందుకోసం హిందూ ద్రోహులు కులాల పేరుతో చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ సృష్టిలో పరమత సహనం కలిగిన ఏకైక ధర్మం హిందుత్వమేనని పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు చేసిన ఆకృత్యాలను భరించి, చిత్రహింసలు అనుభవించి ప్రాణ త్యాగం చేసి, హిందుత్వానికి ప్రాణం పోసిన వీరుల చరిత్ర నేటి హిందూ సమాజం తెలుసుకోవాలని ఆయన కోరారు. 
 
నాటి దుర్మార్గపు అరాచక రాజుల దాడిలో హిందూ ధర్మం కోసం అనేకమంది ప్రాణదాగం చేశారని చెబుతూ అంతటి ఈ పరమ పవిత్రమైన హిందూ ధర్మాన్ని నేడు కొంతమంది వీడటం విచారకరమని పేర్కొన్నారు. విజాతీయుల ప్రలోభాలకు గురికాకుండా, పప్పుకు, ఉప్పుకు.. డబ్బుకు దాసోహమై హిందూమతం విడవద్దని కోరారు. 
 
అలా వీడితే నాడు ధర్మం కోసం ప్రాణదానం చేసిన వీరులు క్షమించరని చెప్పారు. ధర్మం వీడిన ప్రతి హిందువును స్వధర్మంలోకి తీసుకువచ్చే బాధ్యత విశ్వహిందూ పరిషత్ దేనని సత్యం స్పష్టం చేశారు. మతమార్పిడి అరికట్టేందుకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపిచ్చారు. 
 
అసాధ్యం అనుకున్న కార్యాన్ని, ముఖ్యంగా అయోధ్య రామ మందిరం నిర్మించి సుసాధ్యం చేశామని పేర్కొంటూ నేడు మతం మారి భారతదేశానికి శత్రువులుగా మారుతున్న వారిని తిరిగి స్వధర్మం లోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. పరాయి మతస్తులతో పోలిస్తే ప్రస్తుతం హిందువుల సంతానం తగ్గుతోందని, ఈ వ్యవహారం భావితరాలకు పెనుముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ కారణంగా నేడు పల్లె పల్లెలో హిందూ ఉత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని చెప్పారు.