నటుడు కైకాల సత్యనారాయణ మృతి

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‎లో తీవ్రవిషాదం నెలకొంది. 
 
కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 
 
1959లో సిపాయి కూతురు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి ప్రాత్రల్లో మెప్పించారు.
కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా, చివరి చిత్రం మహర్షి. 200 మందికి పైగా దర్శకులతో కైకాల పని చేసారు. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఒక దశలో సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత పౌరానిక చిత్రాల్లో రాణించిన ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు.
హీరో, విలన్‌, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆయన అన్నివర్గాల ప్రేక్షకుల హృదాయలను గెలుచుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సినిమాల్లోనే జీవించి చిత్రసీమకు ఆయన అందించిన విజయాలు మరపురానివి. తెలుగు ఆడియెన్స్ చేత ఎస్వీఆర్ వారసుడిగా పిలిపించుకున్న కైకాల మరణం టాలీవుడ్‌కి తీరని లోటు అని చెప్పుకోవాలి.
కాలేజీ రోజుల్లోనే కైకాలకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు. 1994లో బంగారు కుటుంబం చిత్రంలో అద్భుత నటనకు గాను కైకాలకు నంది పురస్కారం లభించింది. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలుపొందారు. రేపు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.