ఎయిర్పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నాం 

కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత దారణంగా మారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను ఆయన గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్లు తప్పని సరిగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మన్సుఖ్ మాండవియా చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా  జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ప్రికాషనరీ డోసుల తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రాండమ్ ఆర్టీ-పీసీఆర్  శాంప్లింగ్ ప్రారంభించినట్లు చెప్పారు.  కొత్త వేరియెంట్ కనుగొనేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ జరుపుతున్నామన్న ఆయన  ప్రపంచవ్యాప్తంగా  వైరస్ కు సంబంధించిన పరిణామాలను భారత్ గమనిస్తోందని చెప్పారు.
కరోనా వ్యాప్తి నిరోధం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. మాస్క్ ధరించాలనే నిబంధనను విధించాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పినట్లు తెలిపారు. ‘‘గ్లోబల్ కరోనా పరిస్థితిపై నిశితంగా దృష్టి పెట్టాం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త కరోనా వేరియంట్‌ను సకాలంలో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు చెప్పాం’’ అని మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు.
కరోనా వైరస్ నిరంతరం క్రమంగా వృద్ధి చెందుతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చురుగ్గా వ్యవహరిస్తోందని భరోసా ఇచ్చారు.  నేరుగా సంబంధాలు ఉన్న వారిలో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధిపై పోరాటం కోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల కరోనా టీకా మోతాదులను  ఇచ్చినట్లు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే భారత దేశంలో వాటి సంఖ్య తగ్గుతోందని చెప్పారు. చైనాలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటాన్ని మనం చూస్తున్నామన్నారు.

 పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు దూరంగా ఉండండి 

కాగా,  ప్రజలు గుంపులుగా చేరవద్దని, వివాహ వేడుకలు, రాజకీయ సమావేశాలు, విదేశీయానాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందనే ఆందోళన నేపథ్యంలో ప్రజలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ, తక్షణమే వీటిని పాటించాలని ప్రజలను కోరింది. 
2021లో కరోనా విజృంభణ వల్ల ఏర్పడిన పరిస్థితులు పునరావృతమైతే ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతానికి భయపడాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేసింది. రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కన్నా, దానిని ముందుగానే నిరోధించడం శ్రేయస్కరమని తెలిపింది.

ఐఎంఏ మార్గదర్శకాలు 

* బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

* భౌతిక దూరం పాటించాలి, సబ్బు, నీళ్లు, లేదా శానిటైజర్‌తో చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

* వివాహ వేడుకలు, రాజకీయ లేదా సాంఘిక సమావేశాలు వంటివాటిలో పాల్గొనడాన్ని తప్పించుకోవాలి.

* విదేశీ ప్రయాణాలను మానుకోవాలి.

* తరచూ విరోచనాలు అవుతుండటం, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

* సత్వరమే కరోనా టీకాలను తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన మోతాదు (డోస్)ను కూడా తీసుకోవాలి.

* ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలి.