సోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. సోపియాన్‌ జిల్లా ముంజ్‌ మార్గ్‌ ఏరియాలోని ఓ ఇంట్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు లొంగిపోవాలని హెచ్చరికలు చేశాయి.

కానీ, ఉగ్రవాదులు భద్రతా బలగాల హెచ్చరికలను లెక్కచేయకుండా కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు ఉగ్రవాదులు లతీఫ్‌ లోన్‌ ఏరియాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరూ కశ్మీర్‌ పండిట్‌ పురాన కృష్ణ భట్‌ను హత్యచేసినట్లు తెలిపారు.

మరో ఉగ్రవాది ఉమర్‌ నజీర్‌ అనంతనాగ్‌ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించినట్లు కశ్మీర్‌ అదనపు డీజీపీ చెప్పారు. ఉమర్‌ నజీర్‌కు నేపాల్‌కు చెందిన టిల్‌ బహదూర్‌ తాపా హత్యలో ప్రయేయం ఉందన్నారు. ఉగ్రవాదుల నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌, 2 పిస్తోల్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోఫియాన్ ప్రాంతంలో నాలుగు రోజులలో జరిగిన మూడవ ఎన్‌కౌంటర్‌ ఇది. ఒక కమాండర్ గా చెప్పుకొనే వ్యక్తితో పాటు మొత్తం తొమ్మిది మంది హిజబుల్ ముజాహిదీన్ లు మృతి చెందారు.