రూ. 100 కోట్ల జమాతే ఇస్లామీ ఆస్తుల జప్తు

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు గత కొంత కాలంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేర్పాటువాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో జమాతే ఇస్లామీకి చెందిన రూ.100 కోట్ల ఆస్తులను రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) సీజ్‌ చేసింది.

గందర్‌బల్‌, బందిపోరా, కుప్వారా, బారాముల్లా జిల్లాలో ఎస్‌ఐఏ ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. అదేవిధంగా లష్కరే తోయిబా కమాండర్‌ ఆస్తులను కూడా అటాచ్‌ చేశారు. గత 30 సంవత్సరాలలో జమాత్ ఇస్లామీ సంస్థ లోయలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నది. ఇందులో భూమి, షాపింగ్ మాల్స్, పాఠశాలలతో సహా పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ ఉన్నది.

దాదాపు 188 ఆస్తులను భద్రతా సంస్థలు గుర్తించాయని ఎస్‌ఐఏ అధికారులు తెలిపారు. ఒక్క కశ్మీర్‌లోనే 300 కు పైగా స్కూల్‌ నిర్వహించేదని తేలింది.  ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.1000 కోట్లు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఆస్తులన్నింటినీ త్వరలో సీజ్‌ చేయనున్నారు. ఈ సంస్థల బ్యాంక్ ఖాతాలను కూడా నిలిపేయనున్నారు.

ఇలా ఉండగా, పరారీలో ఉన్న లష్కరే తోయిబా కమాండర్ అబ్దుల్ రషీద్ అలియాస్ జహంగీర్ ఆస్తులను కశ్మీర్‌లోని దోడా అధికారులు జప్తు చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు దోడా జిల్లా థాత్రిలోని ఖాన్‌పురా గ్రామంలో అతని భూమిని అటాచ్‌ చేశారు. పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారందిరపైనా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అబ్దుల్‌ ఖయూమ్‌ తెలిపారు.