
పల్నాడు జిల్లా మాచర్ల లో శుక్రవారం టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి, హింసాయుత దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణకు దిగడంతో పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వైసిపి కార్యకర్తలు కర్రలు, సీసాలు, రాళ్లతో దాడులకు దిగారు. టిడిపి శ్రేణులను లక్ష్యంగా చేసుకున్నారు.
మాజీ మునిసిపల్ చైర్మన్ తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలు, నేతలపై రాళ్లు, కర్రలు, సీసాలతో దాడికి దిగారు. దీనినిటిడిపి కార్యకర్తలు ప్రతిఘటించారు.
ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ తరువాత మరింత రెచ్చిపోయి, వైసిపి కార్యకర్తలు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటితోపాటు ఆఫీసుకు, నాయకుల వాహనాలకు నిప్పు పెట్టారు. టిడిపికి చెందిన మరో ఇద్దరు నాయకుల ఇళ్లను కూడా దగ్ధం చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పట్టణంలో అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ పోలీసులు విధించారు.
ఈ సంఘటన పై నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చలో మాచర్ల కు పిలుపు నివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఇతరులు ఏవరు మాచర్ల నియోజకవర్గంలోకి రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.
మాచర్ల పట్టణంలో ఇరుపార్టీల మధ్య జరిగిన ఘటనలో ఫ్యాక్షన్ కు సంబంధించిన మూలాలు ఉన్నాయని, రాజకీయ అంశాలను లేవని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఖండిస్తూ రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
అలాగే, డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధ్యులపై, గూండాలకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ తిరుపతి
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత