ఏపీలో మూడు మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత (సీఎస్‌ఎస్‌) కింద ఆంధ్రప్రదేశ్‌లోని  పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి డా. భారతీ ప్రవీణ పవార్ తెలిపారు. ఈ మూడు కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు తెలిపారు.

అలాగే  రెండవ దశలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ కొత్త పీజీ కోర్సులు ప్రారంభించేందుకు 1040 పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.

దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఆమె చెప్పారు.

ఇప్పటికే సీఎస్ఎస్ కింద మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల లిస్టులో లేని కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు మంత్రి తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానంగా వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సహా మొత్తం 6 ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని  డా. పవార్ తెలిపారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వాటిలో ఒకటి విశాఖపట్నంలో 2017-18లో ప్రారంభించగా, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరులో ఉన్న పోస్టల్ డిస్పెన్సరీలను 2019-20లో వెల్‌నెస్ సెంటర్లుగా మార్చామని కేంద్ర మంత్రి వివరించారు.