లక్ష కోట్లతో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా

‘‘కేసీఆర్…. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఝాన్సీ లక్ష్మీబాయినా? ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల సారా (లిక్కర్) దందా చేసింది. అట్లాంటామెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలె?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 
 
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి నిర్మల్‌లోని శివాజీ చౌక్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పేదలు ఆత్మబలిదానాలు చేసుకుంటే.. కేసీఆర్‌ ఇప్పుడు రాజ్యమేలుతున్నాడంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లనుందని తెలిసి  ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
 
ఎనిమిదేళ్ల పాలనలో రూ. 5లక్షల కోట్ల మేర అప్పులు చేసి.. తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని దుయ్యబట్టారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్‌ ఎక్కడికో వెళ్లి దాక్కున్నారని, తమ పార్టీ నాయకురాలు దివంగత సుష్మాస్వరాజ్‌ ‘జై తెలంగాణ’ అంటూ నినదించడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. గడీలో బంధీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు ఉద్ఘాటించారు.
 
నిర్మల్ జిల్లా అల్లకల్లోల మంత్రి అవినీతి వేలాది ఎకరాలను కబ్జా చేసి వేల కోట్లు దోచుకున్న తిమింగలంలా మారారని ఆయన మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 40 శాతం ఒక వర్గానికే కేటాయిస్తే 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోనని, హిందువులను మోసం చేసి దాడులు చేస్తే నిర్మల్ కు వచ్చి ఒక్కొక్కరిని బట్టలూడదీసి తరిమితరమి కొడతామని హెచ్చరించారు. 
 
అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతో పాటు అవినీతి తిమింగల అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని ప్రకటిస్తారు. నిర్మల్ లో ప్రభుత్వ భూములనే సాకుతో శాంతి నగర్ లో పేదల ఇండ్లను కూల్చేసిన అధికారులు అవే ప్రభుత్వ భూముల్లో బడా బాబుల విల్లాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. 
‘‘ఇక్కడున్న రమేశ్‌లు.. నవీన్‌లు వారి పేరుపక్కన ఖాన్‌, పాషా అని మార్చుకుంటే.. డబుల్‌ ఇళ్లు తెల్లారేసరికి వచ్చేస్తాయి’’అని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఇచ్చే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను తమ ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని వాగ్దానం చేశారు. ఆ మొత్తాలను జనవరి 10లోగా తిరిగి చెల్లించకుంటే.. నిర్మల్‌ వచ్చి, యుద్ధం చేస్తానని, భూకంపం సృష్టిస్తానని హెచ్చరించారు. 
 
బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్ కు బుల్డోజర్లను పంపి బడా బాబుల ఇండ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే వారి బట్టలూడదీయిస్తామని స్పష్టం చేశారు. హిందూ అమ్మాయి శ్రద్దావాకర్ ను 36 ముక్కలు చేయడంతోపాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఆ అప్తాబ్ విషయంలో లౌకిక శక్తుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు.