ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం డిప్యూటీ సెక్ర‌ట‌రీని అరెస్టు చేసిన ఈడీ

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీ ర్యాంకు ఉద్యోగి సౌమ్యా చౌరాసియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) శుక్రవారం అరెస్టు చేసింది. మనీ లాండరింగ్, బొగ్గు లెవీ కుంభకోణం సంబంధిత ఆరోపణల కింద అరెస్టు చేశారని తెలిసింది. 
 
ఛత్తీస్‌గఢ్‌లో ఆమె చాలా శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి(బ్యూరోక్రాట్). అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పిఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసి ప్రశ్నిస్తునట్లు  తెలుస్తున్నది.  రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా సహకరించారనే అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నట్లు ఈడీ తెలిపింది. 
 
ఇదే విషయమై  ఇప్పటికే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సౌమ్య చౌరాసియాకు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేసింది. బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కు అనుమతుల వ్యవహారంపై గత రెండు నెలల్లో పలుమార్లు సౌమ్యను ప్రశ్నించిన ఈడీ తాజాగా ఇప్పుడు అరెస్టు చేసింది. 2002 మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను అరెస్టు చేశామని వెల్లడించింది. 
 
రాష్ట్రంలోని పలు బొగ్గు గనుల్లో పరిమితికి మించిన స్థాయిలో మైనింగ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఒక్కో టన్ను బొగ్గుపై అదనంగా 25 రూపాయలు పన్నును అక్రమంగా వసూలు చేశారని.. ఈ వసూళ్ల బాగోతంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, దళారుల హస్తం ఉందని ఐటీ శాఖ అభియోగాలను దాఖలు చేసింది. 
 
ఈమేరకు ఐటీ శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది.  రాష్ట్ర పరిపాలన సర్వీస్ కు చెందిన ఆమె  2008లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
 
మనీలాండరింగ్ కేసులో ఈడి ఇదివరకే  అక్టోబర్‌లో ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్‌ని, కీలక నిందితుడు సూర్యకాంత్ తివారి, మరో ఇద్దరు వ్యాపారులను  అరెస్ట్ చేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఫిర్యాదు అందాక ఈడి ఈ మనీలాండరింగ్ దర్యాప్తును మొదలెట్టింది. 
 
గ‌తేడాది జూన్‌లో ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌లో ఆదాయపన్ను  అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో దాదాపు రూ. 100 కోట్ల‌కు పైగా హ‌వాలా రాకెట్‌ను గుర్తించారు.  అయితే పెద్ద ఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారిందని పేర్కొన్నారు.  సౌమ్య చౌరాసియా నివాసంలోనూ 2020, ఫిబ్ర‌వ‌రిలో త‌నిఖీలు నిర్వ‌హించారు అధికారులు.
 అయితే, రాజ‌కీయంగా క‌క్ష తీర్చుకునేందుకే కేంద్రం ఈడీ, ఐటీల‌ను రాష్ట్రాల‌పై ప్ర‌యోగిస్తుంద‌ని సీఎం భూపేశ్ భ‌గేల్ పేర్కొన్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు.