ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు బృందాలు నిర్దేశిత ప్రాంతాలు, సంస్థలు, వ్యక్తుల నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఎటువంటి సమాచారం బయటకు రానీయడం లేదు. ప్రధానంగా మంగళగిరి వద్ద ప్రసిద్ధి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అందులో గతంలో కీలకంగా పని చేసిన వారే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో రికార్డులను అధికారులు పరిశీలస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు రెండు బృందాలుగా విడిపోయి రికార్డులు తనిఖీ చేస్తున్నారు.
అలాగే ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కమిటీ సభ్యుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోందని సమాచారం. ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యురాలు అక్కినేని మణి ఎన్‌ఆర్‌ఐ నిధులతో సొంత ఆస్పత్రికి వైద్య పరికరాలు కొన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతన్నాయనే ప్రచారం సాగుతోంది.
అలాగే ఎన్‌ఆర్‌ఐ కమిటీ మరో సభ్యుడు నిమ్మగడ్డ ఉపేంద్ర ఇంటిపైనా కూడా దాడులు నిర్వహిస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో డైరెక్టర్ గా వ్యవహరించిన మణి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి లోపలికి ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు.
ఆస్పత్రి సిబ్బంది ఫోన్లను కూడా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ తో సహా సిబ్బందిని 8 మంది ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమెరికాలో వైద్యురాలిగా ఉంటూ ఈ ఏడాది ఆగస్టులోనే విజయవాడలో అక్కనేని మణి అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు.
అక్కినేని మణిని విచారణ అధికారులు ఒక కారులో తీసుకెళ్లారని తెలుస్తోంది. విదేశీ నిధులు అక్రమంగా దారిమళ్లింపు చేశారనే ఆరోపణల నేపధ్యంలో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
సోదాల తరువాత అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
కాగా, కరోనా సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని గత ఏడాది తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి యాజమాన్యం రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు. సుమారు 1500 మంది కరోనా కేసులకు చెందిన వివరాలను నమోదు చేయాలేదని, వారికి కంప్యూటర్ రసీదులు కాకుండా మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని కేసులు నమోదు అయ్యాయి.
ఆస్పత్రుల నిర్వహణకు వచ్చిన నిధులు పక్కదారి పట్టించి ఇతర భవనాల కోసం వెచ్చించినట్లు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధిన ఫీజుల విషయంలో నిధుల గోల్‌మాల్ జరిగిన దరుణంలో దాడులు చేసినట్లు తెలుస్తుంది.
More Stories
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్