మంగళూరు పేలుడు మా పనే… మరో దాడికి సిద్ధం!

అంతగా ఎవరికి తెలియని ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్(ఐఆర్‌సి) నవంబర్ 19న మంగళూరులో జరిగిన పేలుళ్లకు తమదే బాధ్యత అని పేర్కొంది. తమ ముజాహిద్ సోదరుడు ముహమ్మద్ షరీఖ్ కద్రీ (దక్షిణ కన్నడ జిల్లా)లోని హిందూ మందిరంపై దాడి చేయాలనుకున్నాడని కూడా తెలిపింది. ఆ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
పైగా, మరో దాడికి సిద్ధంగా ఉండాలని ఆ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈఆ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి తమ సోదరుడని పేర్కొన్న ఇస్లామిక్ సంస్థ.. నిజానికి తమ టార్గెట్ మంగళూరు నగరం కాద్రిలోని ఓ దేవాలయమని పేర్కొంది. ప్రీ మేచ్యుర్ పేలుడు కారణంగా షరీఖ్ పోలీసుల చేతికి చిక్కాడు. 
 
అంతేకాక ఆ సంస్థ (ఐఆర్‌సి) ఏడిజిపి అలోక్ కుమార్‌ను కూడా హెచ్చరించింది. “షరీఖ్‌ను పట్టుకున్న మీరు ఆనందంతో ఉండవచ్చు. కానీ అది ఎంతో కాలం ఉండదు. మా దృష్టిలో మీరున్నారు. మీ అణచివేతలకు ఫలితం అనుభవిస్తారు. కొంత కాలం వేచి చూడండి. మేము మీ వద్దకు వస్తాం” అని వారు అలోక్ కుమార్‌కు హెచ్చరిక కూడా చేశారు. 
 
‘రాజ్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే తాము ఈ పోరాటం చేస్తున్నాం’ అని కూడా ఆ సంస్థ తెలిపింది. తాము కేవలం తమ మీద జరుపుతున్న దాడులను, తమ మత వ్యవహారాలలో కలుగజేసుకోడాన్ని తిప్పికొడుతున్నట్లు వివరణ ఇచ్చింది.
 
 ఈ వైరల్ పోస్ట్‌పై అలోక్ కుమార్ “మేము ఆ సందేశంలో అసలెంత అన్నది కనిపెట్టే యత్నం చేస్తున్నాం” అని తెలిపారు. మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు దాడిని అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్‌సీ చేసిన ప్రకటనను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. 
 
దాడికి పాల్పడిన నిందితుడు తొలుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు నిర్వహించే చిల్డ్రన్స్ ఫెస్ట్‌లో బాంబును పేల్చాలని అనుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును త్వరలోనే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్టు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.