
అరుణాచల్ ప్రదేశ్‌లోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 690 ఎకరాల విస్తీర్ణంలో రూ.640 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. గంటకు 200 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలిగే ఎనిమిది చెక్ ఇన్ కౌంటర్లు నిర్మించారు.
2300 మీటర్ల రన్‌వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్రయాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచల్‌లో మొత్తం మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి రాగా, ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్య 16కు చేరింది.
ఇది కాకుండా 600 మెగావాట్ల మెంగ్ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ను పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ. 8,450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశామని, ఈ అదృష్టం తనకు దక్కిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వర్క్ కల్చర్ ను తీసుకొచ్చిందని చెప్పారు. సంస్కృతి లేదా వ్యవసాయం, వాణిజ్యం లేదా కనెక్టివిటీ అయినా, ఈశాన్య ప్రాంతాలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
2019లో తాను ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినప్పుడు ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఈ శంకుస్థాపన చేశానని, విమానాశ్రయం కట్టడం లేదని, ప్రతిపక్షలు బీజేపీపై రాళ్లు రువ్వరని ప్రధాని గుర్తు చేశారు.నేటి ప్రారంభోత్సవం వారికి చెంపపెట్టులాంటిదనీ ధ్వజమెత్తారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలోంచే వాళ్లు (విమర్శకులు) చూస్తుంటారని, అలాంటి వాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.
రెట్టించిన ఉత్సాహంతో దేశం ప్రగతి పథం వైపు దూసుకెళ్తోందని, ఇప్పటికైనా ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికారు. నేడు దేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతోన్నాయని పేరొక్నటు దేశ ప్రజల అభివృద్ధే.. తమ ప్రభుత్వం ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. ఏడాదికి 365 రోజులు, 24 గంటలూ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రానంతరం ఈశాన్య ప్రాంతాలు భిన్నమైన యుగానికి సాక్ష్యమిచ్చాయని ప్రధాని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందనీ, అటల్ జీ ప్రభుత్వం వచ్చాక తొలిసారి ఈ ప్రాంతంలో మార్పు ప్రారంభమైందనీ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం ఇదేననీ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దేశంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడం లక్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో విమానాశ్రయం ఉండాలనేది తన కల అని చెప్పారు. ప్రధాని మోదీ కృషితో ఆ కల నేడు నెరవేరిందనీ, ఈ విమానాశ్రయ నిర్మాణానికి ప్రధాని మోదీ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
రాజధానికి సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడం. దేశంలోని అన్ని ప్రాంతాలకు తన రాష్ట్రంలోని ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేయడం,వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మెరుగుపరచడం. మెరుగైన చికిత్స కోసం రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు