గుజరాత్ లో నామినేషన్ వెనుకకు తీసుకున్న ఆప్ అభ్యర్థి

గుజరాత్ లో నామినేషన్ వెనుకకు తీసుకున్న ఆప్ అభ్యర్థి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీ చేస్తూ, తామే అధికారంలోకి రాబోతున్నామని విస్తృతంగా ప్రచారం చేసుకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. తమ భ్యర్థిని బిజెపి వారు అపహరించుకు పోయారని మంగళవారం మధ్యాహ్నం నుండి ఆప్ అగ్రనేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న అభ్యర్థి  కంచన్ జరివాలా బుధవారం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

సూరత్ (తూర్పు) నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కన్పించట్లేదంటూ బుధవారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నామినేషన్ ఉపసంహరించుకునేలా ఆయనపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.

నామినేషన్ పత్రాల పరిశీలన కోసం కంచన్ మంగళవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ వ్యక్తులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీనే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు.

దీంతో ఇది కాస్త తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడం గమనార్హం. అనంతరం ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

 కాగా, తన నామినేషన్‌ ఉపసంహరణ వెనుక ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొంటూ జరీవాలా ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. ఆప్‌ నుంచి పోటీచేస్తున్నందున నియోజకవర్గ ప్రజలు తనను దేశ, గుజరాత్‌ వ్యతిరేకిగా చూస్తున్నారని, అందుకే విత్‌డ్రా చేసుకొన్నానని చెప్పుకొచ్చారు.