రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్షమాపణ కోరిన మమత

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్షమాపణ కోరిన మమత
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తెలిపారు. నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా. మా ఎమ్మెల్యే తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఐయామ్‌ సారీ’ అని ఆమె చెప్పారు.
ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు.  సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రూపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు. దానితో, అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు.

 తాజాగా నబన్నాలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతికి క్షమాపణలు తెలియజేశారు. “మా పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తా” అని ఆమె  స్పష్టం చేశారు. అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు.

”రాష్ట్రపతిపై మాకు అపార గౌరవం ఉంది. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారు. ఆమెపై కామెంట్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాను” అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అందం అనేది మనం బయటకు ఎలా కనిపిస్తున్నామనే దానిని బట్టి ఉండదని, అంతఃసౌందర్యాన్ని బట్టే ఉంటుందని మమత అభిప్రాయం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని పేర్కొంటూ  ఎమ్మెల్యే వాఖ్యలపై సదరు ఎమ్మెల్యేను హెచ్చరించడంతో పాటు పార్టీ సైతం క్షమాపణలు తెలియజేస్తోందని ఆమె తెలిపారు.