సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాల కేసులు 

పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)  డైరెక్టర్ జనరల్  పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.  అదే స్థాయిలో ఉగ్రదాడులను భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయని, పొరుగు దేశం ప్రతి కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. 
 
2020లో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్స్ సంచరించినట్టు బీఎస్ఎఫ్ గుర్తించగా, అది గత ఏడాది(2021)లో సంఖ్య 109కి పెరిగింది. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు అయిందనీ, ఈ ఏడాదిలో 266 డ్రోన్స్ సంచరించినట్లు ఆయన తెలిపారు. అందులో పంజాబ్‌లో 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా,  జమ్మూలో దాదాపు 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయని సింగ్ చెప్పారు.
 
 ఈ డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతుందని పేర్కొన్నారు. అందులో సెప్టెంబర్,అక్టోబర్‌ నెలలో పాకిస్తాన్ నుండి పంపిన 191 డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించిందని, అందులో 171 డ్రోన్‌లు పంజాబ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించగా, 20 డ్రోన్‌లు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించాయని వెల్లడించారు.
అదే సమయంలో పాకిస్తాన్ ఏడు డ్రోన్‌లను లక్ష్యంగా చేసుకుని జారవిడిచింది.ఈ సమస్యను పరిష్కరించడానికి బిఎస్‌ఎఫ్ పటిష్టమైన చర్యలు చేపడుతనున్నట్లు తెలిపారు. డ్రోన్‌లపై ఫోరెన్సిక్ అధ్యయనాలు చేసేందుకు బీఎస్‌ఎఫ్ ఇటీవల ఢిల్లీలోని క్యాంపులో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేసిందని, ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు.
ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం దాదాపు రూ. 50 లక్షలు వెచ్చించిందనీ, దీనిని నడపడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చేస్తున్నదని తెలిపారు. సరిహద్దుల ఆవల నుంచి, నేరగాళ్లు ఎక్కడి నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? నిఘా సంస్థలు వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించగలుగుతున్నాయని బీఎస్ఎఫ్ చీఫ్ చెప్పారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన వెబ్‌నార్ సెషన్ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందని తెలిపారు.