రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదలకు సుప్రీం ఆదేశం

రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదలకు సుప్రీం ఆదేశం

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్ విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 

రాజీవ్‌ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. మేలో పెరారివళవన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడు జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

2022 మే 18న పెరరివాలన్ ను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును మిగిలిన దోషులకు కూడా వర్తింప చేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో నిందితులందరూ 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు.

దీంతో దోషులు నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ లను విడుదల  చేయాలని ఆదేశాలిచ్చింది. దోషులు జైలులో మంచి నడవడికతో ఉన్నారని, జైలులో ఉన్న సమయంలో వివిధ డిగ్రీలు పూర్తి చేశారని కోర్టు తెలిపింది. అలాగే సెప్టెంబర్ 9, 2018లో దోషులను విడుదల చేయాలంటూ అప్పటి తమిళనాడు కేబినెట్ కూడా సిఫారసు చేసినట్లు కోర్టు తెలిపింది.  

ఇదిలా ఉండగా.. 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ పాదాభివందనం చేస్తున్నట్లుగా ఓ అమ్మాయి (థాను) వంగుతూ.. అదే సమయంలో వెంట తెచ్చుకున్న బాంబును పేల్చడంతో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

1998లో పెరారివాళన్‌, నళిని సహా 26 మంది నిందితులకు హత్య కేసులో పాత్ర ఉందంటూ టాడా కోర్టు శిక్ష విధించింది. తర్వాత కొంత మంది నిందితులకు మరణశిక్ష విధించారు. అయితే, 2014లో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.