సెమీస్లో భారత్ ఓటమి..ఫైనల్లోకి ఇంగ్లాండ్

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లోకి ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. రెండో సెమీస్ లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించడం విశేషం. ఆ జట్టు ఓపెనర్లు అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. దానితో  సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారు.  కెప్టెన్ బట్లర్ తో పాటు..అలెక్స్ హేల్స్ ..భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ బౌలర్ ను ఉతికారేశారు. అర్షదీప్ సింగ్, షమీ, భువీతో పాటు అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. వీరిద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్సులు బాదుతుంటే..భారత బౌలర్లు చూస్తూ ఉండిపోయారు.
 
వీరిద్దరిని ఔట్ చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఇంగ్లాండ్ 169 పరుగుల టార్గెట్ ను కేవలం 16 ఓవర్లలోనే అందుకుని టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
 
అంతకుముందు టాస్  ఓడి బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కేఎల్ రాహుల్..ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగులే చేశాడు. ఇక గత మ్యాచుల్లో విఫలమైన రోహిత్ శర్మ..27 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ..హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
 
అయితే గత మ్యాచుల్లో చిచ్చరపిడుగుల చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు. సూర్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. 33 బంతుల్లో 63 పరుగులు చేసి చివరి బంతికి పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్దాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్, వోక్స్ చెరో వికెట్ తీశారు.
 
మీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా వెళ్లిన రోహిత్ శర్మ..సెమీస్లోనే ఇంటి ముఖం పట్టడంపై తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక దుఖం:తో ఉండిపోయాడు. అయితే రోహిత్ శర్మను కోచ్ ద్రవిడ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. అటు గ్రౌండ్లో కోహ్లీ సైతం నిరాశలో కూరుకుపోయాడు.
 
ఇంగ్లాండ్ చేతిలో ఓడటానికి బౌలర్ల ప్రదర్శనే కారణమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.  ఓటమితో తీవ్ర నిరాశకు లోనైనట్లు చెప్పాడు. బ్యాటింగ్ బాగానే చేసినా..బౌలింగ్లో రాణించలేకపోయామన్నాడు.  నాకౌట్‌ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించాలని..అయితే ఈ మ్యాచ్లో ఒత్తిడి జయించలేకపోయామన్నాడు.
టీమిండియా  ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్‌లు కొత్తకావడన్నాడు. ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడినవాళ్లేనని..వారంతా ఒత్తిడిని జయించినవారే అని తెలిపాడు.