గుజరాత్ కాంగ్రెస్ ను వీడిన మరో సీనియర్ ఎమ్మెల్యే 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత మోహన్ సింహ్ రాథ్వా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగా తాజాగా మరో నేత అదే బాట పట్టాడు.
సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్‌కు పంపారు. ఆనంతరం బీజేపీలో చేరారు. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
63 ఏళ్ల బరాద్ గిర్ సోమనాథ్ జిల్లాలోని తలాలా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టుగా భగవాన్ బరాద్ తెలిపారు. టికెట్ ఆశించకుండానే బీజేపీలో చేరినట్టుగా తెలిపారు.
గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 99 సీట్లు గెలిచి వరుసగా ఆరోసారి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అయితే.. ఇప్పుడు అక్కడ ఆప్ కూడా పోటీ చేస్తుండడంతో ఈ సారి  ఎన్నికలు మరింత అసక్తిగా మారాయి.
ఇలా ఉండగా, బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా  ప్రకటనకు కొద్దిసేపటికి ముందు మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని, మాజీ ఉప ముఖ్యమంత్రి
నితిన్ పాటిల్ తదితర సీనియర్ నాయకులు తాము ఎన్నికలలో పోటీ  చేయబోవడం లేదని ప్రకటించారు.