`ఆత్మ నిర్భర్ భారత్’కు దశాబ్దాల క్రితమే బీజం వేసిన దత్తోపంత్!

 
* 102వ జయంతి నివాళి
కరోనా వైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం `ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం చేపట్టి `స్వదేశీ’ ఆర్థికాభివృద్ధి ఆర్ధిక నమూనాతో భారత్ ను 2047 నాటికి ఆర్ధికంగా అగ్రగామిగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నది.  అయితే అందుకు బలమైన సైద్ధాంతిక పునాది, తాత్వికమైన ఆలోచనలను పలు దశాబ్దాల క్రితమే మన ముందుంచారు  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  (ఆర్ఎస్ఎస్) శ్రేష్ఠ కార్యకర్త దత్తపత్  ఠేంగ్డీజీ.
భారతీయ ఆర్ధిక వ్యవస్థలో స్వదేశీ ఆలోచనలను ఇనుమడింప చేయడం కోసం ఆయన స్థాపించిన భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ వంటి సంఘ్ ప్రేరేపిత సంస్థలు ఈ రంగంలో సరికొత్త ఆలోచనలను, విధానాలను ప్రేరేపిస్తుండటాన్ని చూస్తున్నాము. 
సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ రెండేళ్ల క్రితం వార్షిక విజయదశమి ప్రసంగంలో ‘స్వదేశీ’ ఆర్థిక తాత్విక ఆలోచనల గురించి ప్రస్తావిస్తూ ఠేంగ్డీజీని ఉదహరించారు.  “దివంగత శ్రీ దత్తోపంత్   ఠేంగ్డీజీ స్వదేశీ భావన వస్తువులు, సేవలకు మించి జాతీయ స్వావలంబన, సార్వభౌమాధికారం, సమానత్వాన్ని సాధించడం ద్వారా అంతర్జాతీయ సహకారం సాధించడానికి నిలుస్తుందని పేర్కొన్నారు” అని గుర్తు చేశారు.

“కాబట్టి భవిష్యత్తులో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి,  అంతర్జాతీయ సహకారం పొందేందుకు, మనం విదేశీ పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తాము.  కొత్త సాంకేతికతలను అందించే కంపెనీలకు సడలింపులను అందిస్తాము. అయితే వారు మన నిబంధనలు, పరస్పర ఆమోదయోగ్యమైన షరతులకు లోబడి ఉండాలి.  అయితే అటువంటి  నిర్ణయం పరస్పర ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉండాలి” అని చెప్పారు.

ఠేంగ్డీజీ జన్మ శతజయంతి సందర్భంగా “దత్తోపంత్ ఠేంగ్డీ: ది యాక్టివిస్ట్ పార్లమెంటేరియన్” అనే గ్రంధాన్ని నవీన్ కళింగన్, అనిర్బన్ గంగూలీ సంపాదకత్వంలో ప్రచురించారు. 1964 నుండి 1976 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభలో భారతీయ జనసంఘ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఠేంగ్డీజీ  గురించి అంతగా తెలియని కోణాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ గ్రంధంలో ప్రయత్నించారు. 
 
ప్రపంచీకరణ ముగుస్తుందని ముందే చెప్పారు 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ కో-కన్వీనర్ ఎస్. గురుమూర్తి ఈ గ్రంధానికి వ్రాసిన ముందుమాటలో ఠేంగ్డీజీ ఊహించినట్లుగానే ప్రపంచం ఇప్పుడు ప్రపంచీకరణ ఆలోచనకు దూరమవుతోందని గుర్తు చేశారు.

“తొంభైల ప్రారంభంలో ప్రపంచీకరణ భారతదేశాన్ని సవాలు చేసినప్పుడు,  ప్రతి ఒక్కరూ నిస్సహాయంగా దానిని వ్యతిరేకించడమో లేదా గుడ్డిగా స్వాగతించడమో మాత్రమే చేస్తున్నప్పుడు,  ఠేంగ్డీజీ  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, స్వదేశీ ఆలోచనను గుర్తుచేశారు. దానిని స్వదేశీ నమూనాతో నిర్వహించడానికి మార్గాన్ని చూపించారు… కేవలం 25 సంవత్సరాలలోపు  ఠేంగ్డీజీ  ఊహించినట్లుగా, ప్రపంచీకరణ ముగిసింది” అంటూ 1980లు 1990లలో ఆయనతో కలిసి పనిచేసిన గురుమూర్తి రాశారు.ఠేంగ్డీజీ   ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఇప్పుడు అమెరికా/పశ్చిమ దేశాలు దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాయి. 1990వ దశకంలో ప్రపంచీకరణకు ప్రధాన చోదకుడు అయిన అమెరికా అధ్యక్షుడి మాట వినడానికి గ్లోబలిజం భావజాలం కంటే భవిష్యత్తులో దేశం అనే ఆలోచనే ప్రబలంగా ఉంటుందనే దృఢ విశ్వాసం కలిగిన ఠేంగ్డీజీ నేడు జీవించి లేకపోవడం దురదృష్టకరం” అని తెలిపారు.

ఇంకా ఇలా వ్రాసారు: “ప్రపంచీకరణ మేధో యుద్ధ గుర్రం ‘గ్లోబలైజేషన్ ఈజ్ డెడ్’ పేరుతో ప్రపంచీకరణకు సంస్మరణ లేఖ రాయడానికి దారితీసిన ఎకనామిస్ట్ మ్యాగజైన్‌ను చదవడానికి  ఠేంగ్డీజీ   జీవించి లేకపోవడం మరల దురదృష్టకరం.”
 
అంబేద్కర్ తో సాన్నిహిత్యం 
 
ఆర్ఎస్ఎస్ లో రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఆయనకే ఉన్నాయని చెప్పవచ్చు. డా. అంబేద్కర్ గురించి సాధికారికంగా మాట్లాడగలిగిన వారిలో ఆయన ఒక్కరు. ఎందుకంటీ బాబాసాహెబ్ జీవితంలో  చివరి నాలుగు సంవత్సరాలలో అంబేద్కర్‌తో పూర్తి సమయం గడిపారు. ‘నేను బాబాసాహెబ్ ఆందోళనలు, సమస్యలకు ప్రత్యక్ష సాక్షిని’  అని ఠేంగ్డీజీ చెబుతుండేవారు.

అంటరానితనానికి హిందూ మత గ్రంధాలలో అనుమతి లేదని హిందూ సాధువులు, మత పెద్దలు బహిరంగంగా ప్రకటించాలని అంబేద్కర్ కోరుకున్నారని 
ఠేంగ్డీజీ చెబుతుండేవారు. అయితే, అప్పట్లో ఈ దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. కానీ బాబాసాహెబ్ కు అప్పటికే సమయం మించిపోయింది. 1954లో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది.
 
ఈ సందర్భంగా బాబాసాహెబ్ ఠేంగ్డీజీ మాట్లాడుతూ ‘అస్పృశ్యతను తొలగించే ఆర్‌ఎస్‌ఎస్ ప్రక్రియపై నాకు నమ్మకం ఉంది. కానీ అది చాలా నెమ్మదిగా ఉంది. నేను వేచి ఉండలేను. ఎందుకంటే నేను సమస్యకు ముగింపుని చూడలేను’ అని తన ఆవేదనను వ్యక్త పరిచారు.  బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించేలా చేసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆయన మాటల్లోనే ఠేంగ్డీజీ ఇలా చెప్పారు: ‘ఈ నిస్సహాయ సమాజానికి నేను మార్గం చూపకపోతే, వారిని క్రైస్తవ చర్చి, కమ్యూనిస్టులు వేటాడతారు.’
“1954లో బాబాసాహెబ్ హిందూ మత పెద్దలను కోరుకున్నదానిని ఆర్‌ఎస్‌ఎస్ ఒక దశాబ్దం తర్వాత, 1965లో ఉడిపిలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన హిందూ మత పెద్దల సదస్సులో చేయమని వారిని ఒప్పించగలిగింది” అని ఠేంగ్డీజీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
స్వదేశీ కార్మిక, ఆర్ధిక ఉద్యమాలు 
మొత్తం ప్రపంచం కేవలం పెట్టుబడిదారీ, కమ్యూనిస్ట్ అభివృద్ధి నమూనాలు మాత్రమే మార్గమని చూస్తున్న సమయంలో భిన్నమైన భారతీయ విధానాలను జాతీయ జీవన రంగంలో ప్రతిపాదించిన ఘనత ఆయనకు దక్కుతుంది. ముందుగా కమ్యూనిస్ట్ ఆలోచనలతో నిండిపోయిన కార్మిక ఉద్యమంలో భారతీయ తాత్విక ఆలోచనలకు ప్రతిరూపమైన భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించారు.
బిఎంఎస్ స్థాపనకు ముందు ఆయన స్వయంగా కాంగ్రెస్ నాడు దేశంలో అగ్రగామి కార్మిక సంఘంగా ఉన్న ఇంటియుసిలో మధ్యప్రదేశ్ కార్యదర్శిగా కొంతకాలం పనిచేసి, కార్మిక ఉద్యమం లోతుపాతులు అధ్యయనం చేశారు. ఓ పుష్కరకాలం వరకు జాతీయ స్థాయి నాయకత్వం లేకుండానే క్షేత్రస్థాయిలో కార్మిక సంఘాలను బలోపేతం చేస్తూ వచ్చారు.
నేడది ప్రపంచంలోని అతి పెద్ద కార్మిక సంఘాలలో ఒకటిగా ఎదిగింది. ఇక ఆర్ధిక రంగంలో స్వదేశీ జాగరణ్ మంచ్ ద్వారా ప్రత్యామ్నాయ విధానాలను దేశం ముందుంచారు. నేడు దాదాపు అందరూ ఆ విధానాలను ఆమోదింప వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట సారధ్యం 
భారత దేశంలో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటానికి సహితం ఠేంగ్డీజీ సారధ్యం వహించారు. ఎమర్జెన్సీ ప్రకటనకు ముందురోజు జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన లోక్ సంఘర్ష్ సమితి కార్యదర్శి నానాజీ దేశముఖ్ అరెస్ట్ కాగానే, ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోని అతిపెద్ద సత్యాగ్రహ ఉద్యమం దేశంలో నిర్వహించడంలో క్రియాశీల పాత్ర వహించారు.
అంతేకాదు, ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు కలసి జనతా పార్టీగా ఏర్పడి, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో సహితం ఠేంగ్డీజీ కీలక భూమిక వహించారు. నాటి జనతా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తమిళనాడుకు చెందిన నెడుసేజియాన్ ఆ సమయంలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ “నేడు మా ప్రభుత్వం ఏర్పడింది అంటే, ఎమర్జెన్సీని దేశ ప్రజలు తిరస్కరించారు అంటే అందుకు కారణం ఠేంగ్డీజీ. మేమంతా జైలులో ఉన్న సమయంలో అజ్ఞాత ఉద్యమాన్ని ఉధృతంగా సాగించి, నియంత మెడలు వంచిన ఘనుడు ఈయనే.  అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో ఆయన ఎటువంటి పదవి చేపట్టలేదు” అంటూ కొనియాడారు.
ఠేంగ్డీజీ 1920 నవంబర్ 10న మహారాష్ట్రలోని వార్ధా జిల్లా అర్వి గ్రామంలో జన్మించారు. మోరిస్ కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, నాగ్‌పూర్‌లోని లా కళాశాల నుండి ఎల్ ఎల్ బి పూర్తి చేశారు.  1940లో గురూజిగా ప్రఖ్యాతి పొందిన ఎం ఎస్ గోల్వాల్కర్  ఆర్ఎస్ఎస్ రెండవ సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించినప్పుడు యువత సంస్థ పనిని విస్తరించడానికి ప్రచారక్ లుగా రావాలని ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ 1942లో  ఠేంగ్డీజీ ప్రచారక్ గా వచ్చారు. 2004 అక్టోబర్ 14న తన 84వ ఏట మృతి చెందే వరకు అలాగే కొనసాగారు.
 
ఆర్ఎస్ఎస్ లో సంస్థాగతంగా పలు బాధ్యతలు చేపట్టడంతో పాటు  1952-1953లో  మధ్యప్రదేశ్‌కు, 1956-57లో దక్షిణ భారతదేశానికి భారతీయ జనసంఘ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, జనసంఘ్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ వంటి అనేక సంఘ్ ప్రేరేపిత సంస్థల ఏర్పాటుతో క్రియాశీలకంగా వ్రాసారు. ఆయన అనేక సైద్ధాంతిక గ్రంధాల  రచయిత కూడా. వాటిలో ఒకటి ‘స్వదేశీ’ ఆర్థికశాస్త్రం బ్లూప్రింట్‌గా పనిచేసే గ్రంధం – ‘మూడవ మార్గం’. అపూర్వమైన సంఘటనా చాతుర్యం, విశేషమైన మేధోసంపద, విశిష్టమైన సైద్ధాంతిక పటుత్వం  కలిగిన ఆయన దార్శనికుడు.