విభజన హామీలపై 23న కేంద్రం సమీక్ష

తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, ఇతర సమస్యలపై ఈ నెల 23న కేంద్ర  ప్రభుత్వం మరోసారి సమీక్ష జరుపనుంది.  హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సమావేశం జరగనుంది. కాగా ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు హాజరుకానున్నారు.   ఇంతకు ముందు సెప్టెంబర్‌ 27న భేటీలో 14 అంశాలపై అధికారులు చర్చించారు. 
 
ఈ సమావేశంలో విభజన హామీలతోపాటు వివిధ ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనలు, కేంద్రం ఇచ్చిన హామీలు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగాల్సిన అంశాలను అజెండాలో చేర్పారు. ఈ మేరకు భారీ అజెండా కూడా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం  ప్రతిపాదించిన 34 అంశాలను అజెండాలో చేర్చినట్లు తెలిసింది. 
 
దీనిలో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రెవెన్యూ లోటు, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆస్తులకు రక్షణ కల్పించడం, విశాఖలో జాతీయ ఫార్మాసూటికల్‌-విద్య అధ్యయన సంస్థ ఏర్పాటు, కొత్త రాజధానికి మౌళిక సౌకర్యాలకు నిధుల సాయం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. 
 
అదే విధంగా, కృష్ణా బోర్డు పరిధిని నిర్వచించడం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఇతర చర్యలు, , ఎర్రచందనం అమ్మకాలకు అనుమతులు, విశాఖలో ఇండియన్‌ విదేశీ వాణిజ్య సంస్థ ఏర్పాటు, నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరా అంశాలను కూడా చర్చింపనున్నారు. 
 
మరోవంక, విజిటిఎం పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మెట్రో రైల్‌ నిర్మాణం, పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి, తాడేపల్లిగూడెంలో నిట్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక అభివృద్ధి కారిడార్‌, 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలున్నాయి. 
 
అలాగే నేరుగా కేంద్రం ప్రతిపాదించిన మరో 34 అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇందులో పెట్రోలియం సహజవాయువుల శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్యం, పోర్టులు, జాతీయ రహదారుల శాఖ, రైల్వేస్‌, హోరశాఖ, ఆర్ధిక, జలవనరుల శాఖ, నీతిఅయోగ్‌, వ్యవసాయం, పౌర విమానయానం వంటి శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 30 అంశాలను కూడా అజెండాలో చేర్చారు.