మునుగోడు ఓట్ల లెక్కింపులో జాప్యం పట్ల బిజెపి ఆగ్రహం

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాన్ని అప్డేట్ చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండడం, ఓట్ల లెక్కింపులో కూడా ఆలస్యం జరుగుతూ ఉండడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధోరణిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వికాస్ రాజ్ కు  ఫోన్ చేసి  మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు.  పొరపాటు జరిగితే అది మీకే మచ్చ,మసక అవుతుందని హెచ్చరించారు.  ఉప ఎన్నికల ప్రచారం.. పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ ఘటనలు ఎన్నికల కమిషన్ మీద చెడు అభిప్రాయం కలుగజేశాయని ఈటెల తెలిపారు.  ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం.. కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండి అని వికాస్ రాజ్ కి సూచించారు. ఫలితాలు సక్రమంగా వెల్లడించాలని రాజేందర్ కోరారు. 

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించడంలేదని ఆరోపించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ విమర్శించారు. మునుగోడు ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, మంత్రులు ఇన్‌చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యత రావటం టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు.

బండి‌ సంజయ్, కిషన్ రెడ్డి  ప్రశ్నిస్తే తప్ప చెబుతూ సీఈవో పనిచేయటం లేదని, ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సీఎంవో ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్‌ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

మునుగోడు బైపోల్ లో నాలుగు రౌండ్ల లెక్కింపులో చూపిన వేగం… ఐదవ రౌండ్లో ఎందుకు తగ్గిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. నాలుగు రౌండ్లలో ఎక్కువ మంది అభ్యర్థులు లేరా…. ఐదవ రౌండ్ లోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారా…. అని నిలదీశారు.