జైలులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర విలాసవంత జీవితం… ఈడీ ఫిర్యాదు

జైలులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర విలాసవంత జీవితం… ఈడీ ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కు తీహార్ జైలులో వీపీఐ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. 
 
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అవినీతి ఆరోపణలపై 2017లో సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ కింద ఈడీ ఆయనను అరెస్టు చేసింది. జైలులో అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాన్ని కూడా కోర్టుకు అందజేసింది.
జైలులో బాడీ మసాజ్‌ వంటి సౌకర్యాలు ఆయన పొందుతున్నట్టు ఈడీ తెలిపింది.  ఆయన క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు జైలు సూపరింటెండెంట్ రోజూ జైన్‌ను కలుస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.  కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని జైలులో ఆయనకు అందిస్తున్నారని కూడా ఈడీ ఆరోపించింది.  జైన్ భార్య కూడా తరచు జైలులో ఆయనను కలుస్తోందని, ఇది జైలు నిబంధనలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చింది.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం జైన్ తరచు ఇతర నిందుతులైన అంకుష్ జైన్, వైభవ్ జైన్‌లను తన సెల్‌లో కలుస్తున్నారని, ఇది కేసు పురోగతికి ఎంతమాత్రం మంచిది కాదని తెలిపింది. కాగా, ఈడీ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు.
 జైన్‌కు రూ.10 కోట్లు చెల్లించానని  సుఖేష్ ఆరోపణ
 ‘ప్రొటక్షన్ మనీ’ కింద సత్యేంద్ర జైన్‌కు తాను రూ.10 కోట్లు చెల్లించానని, మరోవంక,పార్టీలో కీలక పదవికి ఇస్తామన్న హామీ ఇవ్వడంతో పార్టీకి రూ.50 కోట్లు విరాళం ఇచ్చానని ఆర్థిక నేరారోపణలపై అదే జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫిర్యాదుతో కూడిన లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఆయన పంపారు.
హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ప్రిజన్ అండ్ జైల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ ద్వారా తనను జైన్ బెదరించినట్టు ఆ లేఖలో చంద్రశేఖర్ ఆరోపించారు. సత్యేంద్ర జైన్ తనకు 2015 నుంచి తెలుసునని చెప్పారు.  ”2017 నుంచి నేను జైలులో ఉన్నాను. 2015 నుంచి జైన్‌ నాకు తెలుసు. సౌత్ జోన్‌లో కీలకమైన పదవి ఇస్తామని, రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సహకరిస్తామని చెప్పడంతో రూ.50 కోట్లు ఆప్‌కు కంట్రిబ్యూట్ చేశాను” అని చంద్రశేఖర్ స్వదస్తూరీతో రాసిన లేఖలో చెప్పారు.
కాగా,  ప్రొటక్షన్ మనీగా సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, పదవి ఆశచూపించడంతో రూ.50 కోట్లు చెల్లించినట్టు సుఖేష్ చంద్రశేఖర్ చెబుతున్నారని, ఆప్ నేతలంతా దోపిడీదారులని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఒక ట్వీట్‌లో ఆప్‌పై విమర్శలు గుప్పించారు. ఇంత జరుగుతున్నప్పటకీ కేజ్రీవాల్‌పై ప్రభుత్వంలో సత్యేంద్ర జైన్ మంత్రిగానే కొనసాగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించిన సంచలన విషయాలను బట్టే ఆప్‌ను ‘కట్టర్ కరప్షన్ పార్టీ’ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదని బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. కాగా, చంద్రశేఖర్ తాజా ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మొదలుపెట్టింది.