గురువారం జరగబోవు మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ `అంతర్గత సర్వే’ పేరుతో ఓ `నకిలీ సర్వే’ని ప్రచారంలోకి తీసుకు రావడాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన, నకిలీ పత్రం ద్వారా ప్రజలను గందరగోళ పరచడానికి మంగళవారం సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్ఎస్ఎస్ అటువంటి సర్వే ఏదీ నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణము ద్వారా దేశ వైభవము సాధించాలనే మౌలికమైన లక్ష్యముతో 97 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ అని ఆయన తెలిపారు.
పైగా, ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతో గాని, రాజకీయ సర్వేలలోగాని పాలుపంచుకోదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ నిర్భయంగా, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రజలు అందరినీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ వంటి సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థ పై ఇటీవల కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన, అసత్యమైన వార్తలు, కథనాలు, వ్యాఖ్యానాల ద్వారా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరించడం బాధ్యతాయుతమైన ఏ సంస్థకుగాని, వ్యక్తికి గాని తగదని రమేష్ హితవు చెప్పారు.
ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని, సామాజిక విలువలను అగౌరపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు. ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు వార్తలకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట బద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన కోరారు.

More Stories
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు
లైంగిక వేధింపులలతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం