ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి..పలివెలలో ఉద్రిక్తత

ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి..పలివెలలో ఉద్రిక్తత
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాంతో నల్గొండ మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తల పనే అంటూ బీజేపీ ఆరోపించింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.
ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.  పోలీసుల తీరు పై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలివెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. పల్లానే దగ్గరుండే తమపై దాడి చేయించారని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.  గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఈటల విమర్శించారు. మునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెల్లుమంటుందని స్పష్టం చేశారు.
 
పలివెల గ్రామంలో టీఆర్ఎస్ కు బేస్ లేదని విమర్శించారు. పోలీసులను లెక్క చేయకుండా ఇలా వ్యవహరించడం దారుణమని అంటూ  మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర దాడులు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించిన సందర్భంలో ఇలానే వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేశారు.
ఈటెలపై కుట్రలు … కిషన్ రెడ్డి  
గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాపేర్కొంటూ యని పలిమెల గ్రామంలో ఈటల కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఈటలపై కుట్ర జరుగుతోందని, ఈటల మొహం చూడొద్దని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అసెంబ్లీ లో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో లేదని మండిపడ్డారు. పలివెల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే దాడులకు దిగారని, పక్కా ప్లాన్ తో ఇలా చేశారని స్పష్టం చేశారు.