యాదాద్రి లో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి

యాదాద్రి లో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి
యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది. 
 
దేవాధాయ శాఖ వ్యాపార ధోరణి పరాకాష్టకు యాదాద్రి లో ప్రత్యేక బ్రేక్ దర్శనాల పేరిట దోపిడి ఒక నిదర్శనం అంటూ పరిషత్ రాష్ట్ర  సహాయ కార్యదర్శి రావినూతల శశిధర్ విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
 
పార్కింగ్ దగ్గరి నుంచి మొదలు పెడితే దేవుని దర్శనాలు తీర్ధ ప్రసాదాల వరకూ హిందువులను దోచుకోవడం, దేవాలయాలతో వ్యాపారం చేయడమే దేవాదాయ శాఖ పనిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేవాలయాల భూములు, ఆస్తులు వేలం వేసి అమ్ముకుంటున్న తెలంగాణా ప్రభుత్వం దేవుడి దర్శనాలను కూడా వ్యాపారం చేసుకుంటూ భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటుందని ధ్వజమెత్తారు. 
 
భక్తులను ఆర్థిక స్ధితి ఆధారంగా సామాన్య భక్తులు, సాధారణ భక్తులు , ప్రత్యేక భక్తులు, విఐపి  భక్తులు అని విడదీసే అధికారం దేవాదాయ శాఖకు ఏ చట్టం ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది దేవుని ముందు అందరూ సమానమనే ధర్మ సూత్రానికి విరుద్దమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని సృష్టం చేశారు.  
 
ఇలా దేవుడి ముందు వివక్షను చూపి పరోక్షంగా ప్రభుత్వాలు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాయా? అని ప్రశ్నించారు.   రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం దేవాలయ భూములు క్రైస్తవులు ఆక్రమిస్తుంటే, దేవాలయాల భూములలో అన్యమత ప్రార్థనా స్థలాలు వెలుస్తుంటే తెలంగాణా ప్రభుత్వానికి సోయి రావడం లేదని మండిపడ్డారు.  . 
 
ప్రభుత్వాల కభంద హస్తాల నుండి దేవాలయ వ్యవస్థను విముక్తం చేయడానికి పరిషత్ గత అనేక సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందని శశిధర్ తెలిపారు.  త్వరలో తెంలంగాణాలో ఫ్రీ హిందూ టెంపుల్ పేరిట ప్రతేక పోరాటాలు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని ఆయన పిలుపిచ్చారు.