టిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టనున్న కోమటిరెడ్డిపై `నగదు బదిలీ’ ఆరోపణ

ప్రతిష్టాకరంగా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరో రోజులో ముగియనుండగా, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఓటర్లను ప్రభావితం చేశారని అంటూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడం టిఆర్ఎస్ ను ఇరకాటంలోకి  నెట్టివేసి సూచనలు కనిపిస్తున్నాయి. 

నగదు బదిలీ జరిపినట్లు టిఆర్ఎస్ సేకరించిన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఆ పార్టీని  ఆత్మరక్షణలో  పడవేసి అవకాశాలు కనిపిస్తున్నాయి.  బ్యాంకు లావాదేవీలకు గల గోప్యత దృష్ట్యా వాటిని `సాధికారికంగా’ ఏ విధంగా వారు ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకు వచ్చారనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ విషయమై తమ బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలు ఆ విధంగా `లీక్’ కావడం సంబంధిత బ్యాంకు అధికారులను సహితం ఇబ్బందులలోకి నెట్టివేసి అవకాశం కనిపిస్తున్నది.

వారు సంబంధించిన లావాదేవీలే వివరాలు వాస్తవమైతే, ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకుల నుండి వ్యక్తిగత ఖాతాల సమాచారాన్ని సహితం ట్యాప్ చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. పైగా అందుకు సంబంధిత బ్యాంకు ఉద్యోగులు ఎవరైనా సహకారం అందించారా? లేదా బ్యాంకు  ఖాతాలను హ్యాక్ చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తొలుత ఓ టివి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాజగోపాలరెడ్డికి  చెందిన కంపెనీ నుండో ఓ కోటి రూపాయల నగదు బదిలీ జరిగిన్నట్లు ఆరోపించారు. ఆ తర్వాత ఆ పార్టీ నేతలు రూ 5.24 కోట్ల బదిలీ జరిగిన్నట్లు బ్యాంకు లావాదేవీల వివరాలతో ఎన్నికల  కమీషన్ కు ఫిర్యాదు చేశారు. 

సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి  సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో ఈసీఐ స్పందించింది.  రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కంపెనీ నుంచి నగదు బదిలీ చేసిన అకౌంట్లను సీజ్ చేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కూడా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

కోమటిరెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలని రాజ్ గోపాల్ రెడ్డికి ఈసీ ఆదేశించింది.

కాగా, తన కుమారుడును చెందిన సుశీ ఇన్‌ఫ్రా అకౌంట్‌ నుంచి బదిలీ అయిన రూ 5.24 కోట్లకు పైగా నగదు అంశానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ రాజగోపాల్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్‌ ఓడిపోతుందనే ఆ పార్టీ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటర్లు బొంద పెట్టడం ఖాయమ‌ని ధీమా వ్యక్తం చేశారు. 

నిబంధనల ప్రకారం బ్యాంకులు ఆయా ఖాతాలకు సంబంధించిన వారికి తప్పా లావాదేవీల వివరాలను మరెవ్వరికీ ఇవ్వరాదు. దర్యాప్తు సంస్థలు సహితం కోర్ట్ ఉత్తరువు ద్వారా  మాత్రమే ఖాతాలలో లావాదేవీల వివరాలను బ్యాంకుల నుండి పొందగలవు. నేరుగా వారి నుండి పొందలేవు. ఆ విధంగా వ్యక్తిగత వివరాలను అందజేయడం లేదా అపహరించడం క్రిమినల్ కేసుకు దారితీయగలదు. 

ఆ విధంగా బ్యాంకు ఖాతాల వివరాలను టిఆర్ఎస్ నేతలు ఎన్నికల సందర్భంగా దొంగచాటుగా బ్యాంకు నుండి పొందిన్నట్లు వెల్లడైతే ఎన్నికల అనర్హతకు  కూడా దారితీస్తుంది. ఒక వేళా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిన అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది.