సీబీఐ అంటే కేసీఆర్‌కు ఎందుకు భయం?

తప్పు చేయని సీఎం కేసీఆర్, మోసం చేయని ముఖ్యమంత్రి సీబీఐకి ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ప్రశ్నించారు. జీవో 51 విడుదలపై స్పందించిన ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సీబీఐ రావద్దని జీవో 51 ఎందుకు విడుదల చేశారని నిలదీశారు. 
 
జీవో విడుదల చేసి కూడా రెండు నెలలు అవుతోందని, ఇప్పటి వరకు ఎందుకు దాచి పెట్టారని ఆమె ప్రశ్నించారు. ‘‘మీరు రాష్ట్రాన్ని దోచుకోక పోతే, ధరణి పేరుతో భూములను కబ్జా చేయకపోతే.. మీకు సీబీఐ అంటే భయం ఎందుకు?.. జీవో 51 విడుదల చేసి ఈడీ, సీబీఐ ఎమీ చేయలేదని దైర్యంగా ఉన్నారా?.. మీరు ఎక్కడ ఉన్నా, ఏ బొక్కలో ఉన్నా బయటకు తీసుకు వస్తాం’’ అని డీకే అరుణ హెచ్చరించారు.
 
 కేసీఆర్ బిడ్డపై ఆరోపణలతో సీబీఐకి నో ఎంట్రీ జీవో ఇచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో తెలంగాణ ప్రభుత్వం  అనుమతి ఇచ్చింది. అయితే, గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
 
 ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. ఆ జిఓ ను ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన కేసీఆర్ ప్రభుత్వం నలుగురు ఎమ్యెల్యేలను కొనే ప్రయత్నం చేశారని నమోదు చేసిన కేసును  సిబిఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర హైకోర్టులో బిజెపి పిటిషన్ వేయడంతో ప్రభుత్వం ఇప్పుడు బైట పెట్టింది.  2 నెలల క్రితమే జీవో ఉపసంహరించినట్లు శనివారం ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

c