సోషల్ మీడియాలో 60 శాతం నకిలీ వార్తలే!

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సివిలిటీపై మైక్రోసాఫ్ట్‌ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు.  ఆన్‌లైన్‌ మోసాలు, వ్యక్తిగత సమాచార చోరీ, లైంగిక ప్రయోజనాల కోసం చేసే మెసేజ్‌లు, నకిలీ వార్తల ప్రచారం లాంటి కష్టనష్టాలపై మైక్రోసాఫ్ట్‌ ‘డిజిటల్‌ సివిలిటీ సూచిక’ విడుదల చేసింది.
22 దేశాల్లో చేసిన సర్వే సూచీలో భారత్‌ 7వ స్థానంలో ఉన్నది. తప్పుడు సమాచారంతో పాటు 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఆన్‌లైన్‌ బాధితులని తేలింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదికాక మరో 42 శాతం మంది ఫిషింగ్‌, స్పూఫింగ్‌ బాధితులు ఉన్నారు.  మైక్రోసాఫ్ట్‌ తన గత సర్వే నివేదిక 2018తో పోలిస్తే భారతలో అసత్య సమాచారం, అవాంఛిత సందేశాలు (అన్‌వాంటెడ్‌ మెసేజెస్‌), ఆన్‌లైన్‌ మోసాలు 9 శాతం నుంచి 29 శాతానికి చేరాయి.
 
నకిలీ వార్తలలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో చింతన్‌ శివిర్‌ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ చిన్న వదంతు కూడా దేశానికి భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెబుతూ  ఏదైనా మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేసేముందు ఫేక్‌న్యూస్‌ తనిఖీ ఎలా చేసుకోవాలో ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు. 
ఫిర్యాదులకు అప్పిలేట్‌ ప్యానెల్స్‌

కాగా, వివాదాస్పద కంటెంట్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మీడియా సంస్థల నిర్ణయాలపై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు అప్పిలేట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ముగ్గురు సభ్యులు గల గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీలు మూడు నెలల్లో ఏర్పాటు కానున్నాయి. 

ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. నూతన నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కంటెంట్‌కు సంబంధించి సోషల్‌మీడియా సంస్థల నిర్ణయాలను సమీక్షించే అధికారం అప్పిలేట్‌ కమిటీలకు ఉంటుంది.

గత ఏడాది ట్విట్టర్‌, కేంద్రం మధ్య తీవ్ర వివాదం నడిచిన నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజాలకు నియంత్రించే ఉద్దేశంతోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నదని పేర్కొంటున్నారు. ప్రతి అప్పిలేట్‌ ప్యానెల్‌లో ఒక చైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరిని కేంద్రమే నియమిస్తుంది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెళ్లు 30 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది.