షిరిడి సాయి వేల కోట్ల పెట్టుబడుల వెనుక ఉన్నది ఎవరు?

ఆంధ్ర ప్రదేశ్ లో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పెట్టనున్న వేలకోట్ల రూపాయల పెట్టుబడుల వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ. 1,20,000 కోట్ల నూతన పెట్టుబడులతో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.
 
అందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పెట్టుబడులు ఎంత?, ఆ కంపెనీకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉందా?? అని ఆయన నిలదీశారు. ఆ పెట్టుబడులు ఎక్కడ నుండి వస్తున్నాయన్న రఘురామకృష్ణం రాజు, విదేశీ పెట్టుబడులైతే అర్థం చేసుకోవచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 
 
వైయస్సార్ జిల్లా పైడిపాలెం దగ్గర షిరిడి సాయి కంపెనీ 7200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టును రూ. 32 వేల కోట్ల  పెట్టుబడులతో ఇండో సోల్ అనే సంస్థ పేరిట ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2028 వరకు పూర్తి చేయనున్నట్లు, దీని ద్వారా 7200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నట్లు వెల్లడించారు. 
 
నెల్లూరు జిల్లా రామాయంపట్నం దగ్గర ఇండో సోల్ కంపెనీ 5147 ఎకరాలలో పాలిసెలికాన్, మెటాలజికల్ గ్రేడ్ సిలికాన్, ఫ్లోట్ రోల్డ్ గ్లాసెస్ తయారీ సంస్థను రూ. 43,143 కోట్లతో ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, మరో 11 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నట్లు తెలిపారు. 
 
షిరిడి సాయి కంపెనీ రూ. 76 వేల కోట్లతో  రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలంటే బ్యాంకులు ఎంత అధిక మొత్తం రుణాన్ని మంజూరు చేసినా , ఈక్విటీలో 25% మొత్తం అంటే 21 నుంచి 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రమోటర్లు పెట్టుబడి గా పెట్టాలని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని అంటున్నారని, ఆ పెట్టుబడులు పెట్టేది సూట్ కేస్ కంపెనీలా? అని ప్రశ్నించారు.  కడప కు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి తమ జగనన్న ప్రభుత్వం రాకముందు ఇచ్చిన ఆర్డర్లు ఎన్ని?  ప్రస్తుతం ఇస్తున్న ఆర్డర్లు ఎన్ని? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 
 
షిరిడి సాయి కంపెనీకి సెంట్రల్ డిస్కం చైర్మన్ పద్మా జనార్దన్ రెడ్డి విపరీతంగా ఆర్డర్లు ఇచ్చారని, అయితే షిరిడి సాయి కంపెనీకి చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ మోటార్లకు బిగించనున్న స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్టును షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్పగించారని ఆయన తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు, ఐదేళ్ల నిర్వహణ కోసమని రూ. 35 వేలు చేస్తున్నారని తెలిపారు. 
 
వ్యవసాయ మోటార్ మీటరుకు మహా అయితే రూ. 5 వేలు  ఖర్చు అవుతుందని , ఏడాదికి కొత్త మీటర్ బిగించుకున్న రూ 35 వేలు ఖర్చు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల కోసం అమలు చేస్తున్న ధరను, పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక లతో పోల్చి చూస్తే, అసలు విషయం వెలుగులోకి వస్తుందని చెప్పారు. 
 
ఇలా ఉండగా, విద్యుత్ రంగంలో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ విభాగం ఒకటి ఉంటుందని, ఈ విభాగం హెచ్ డి ట్రాన్స్ ఫార్మర్ ల ప్రమాదాల పై అధ్యయనం చేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ లో పనిచేసేవారిని, సాధారణంగా డిస్కములలోకి తీసుకోరని, అయితే  జగనన్న ప్రభుత్వం మాత్రం ఎలక్ట్రికల్  ఇన్స్పెక్టరేట్    లో విధులు నిర్వహిస్తున్న పద్మా జనార్దన్ రెడ్డిని సెంట్రల్ డిస్కం చైర్మన్ గా నియమించిందని విస్మయం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి  వైయస్ వివేకానంద రెడ్డి  హత్య కేసులో ఏ 5 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న తమ పార్టీ కార్యదర్శి శివ శంకర్ రెడ్డి వియ్యంకుడే ఈ  పద్మా జనార్దన్ రెడ్డి అని ఆయన తెలిపారు. సెంట్రల్ డిస్కం చైర్మన్ గా పద్మా జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక, శిరిడి సాయి కంపెనీకి ఇష్టారాజ్యంగా ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు.