బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంపు నిర్ణయానికి ఆ రాష్ట్ర గవర్నర్ తేవర్‌చంద్ గెహ్లాట్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో ఎస్‌సీల రిజర్వేషన్ కోటాను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్‌టీలకు 3 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ బొమ్మై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దీనిపై స్పెషల్ గెజిటి అనౌన్స్‌మెంట్‌ను ప్రభుత్వం పబ్లిష్ చేసింది. మరి కొన్ని కులాలను కూడా చేర్చడంతో కులాల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభా గణనీయంగా పెరిగిందని ఆ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలిపింది.
సమగ్ర అధ్యయనం, విశ్లేషణ అనంతరం రిజర్వేషన్లను పెంచినట్టు నోటిఫికేషన్ పేర్కొంది. గవర్నర్ నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, ఇది చాలా సంతోషకరమైన సందర్భమని అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతూ గత గురువారంనాడు కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని, ఇందువల్ల విద్య, ఉపాధి రంగంలో ఎస్సీ,ఎస్టీలకు మరిన్ని అవకాశాలు లభించి వారి జీవితాలు మెరుగుపడతాయని సీఎం పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆ పార్టీకి చేరువయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Stories
ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి 150 సీట్ల వరకు పోటీ!
ఆత్మహత్యకు పాల్పడిన వైద్యురాలిపై ఓ ఎంపీ వేధింపులు!