
మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ తీరుపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వినతులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్, ఇతర ఎన్నికల అధికారులు స్పందిస్తున్న తీరుపై సీరియస్ అయింది.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై జనరల్ అబ్జర్వర్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఇతర సిబ్బంది ఈసీకి ఒక నివేదిక అందజేశారు. ఇందులో ఎన్నిక నిర్వహణ తీరు, రాష్ట్ర ఎన్నికల అధికారుల వ్యవహార శైలిపై వివరించారు. దీంతో పాటు గురువారం సీఈవో వికాస్ రాజ్, ఇతర అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించేటోళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డూప్లికేట్ ఓటర్లు, గుర్తుల కేటాయింపు, ఎన్నికల కోడ్ అమలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో సీఈవో వికాస్ రాజ్ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.
రాష్ట్ర పరిధిలో సీఈవో దగ్గర పరిష్కారానికి నోచుకోవాల్సిన ఫిర్యాదులు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలంటూ వస్తున్న వినతులు తమ వరకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరి ఫిర్యాదులు, వినతులు పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ సూచించింది.
మునుగోడులో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాము పంపిన జనరల్ అబ్జర్వర్స్ నుంచి వాస్తవ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఈసీ సీరియస్ కావడంతో సీఈవో వికాస్ రాజ్ చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు.
రిటర్నింగ్ అధికారిగా రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి, తర్వాత దాన్ని మార్చిన కేఎం జగన్నాథరావును ఈసీ ఇప్పటికే తొలగించింది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను నియమించింది. తాజాగా జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలంటూ వికాస్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. లేని అధికారంతో గుర్తు మార్పు చేసినందుకు జగన్నాథరావు పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు మునుగోడుకు చెందిన 300 మంది ఓటర్లను టీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రత్యేక బస్సుల్లో యాదాద్రి టూర్ కు తీసుకెళ్లారు. ప్రత్యేక దర్శనం చేయించడంతో పాటు వారితో ప్రమాణం చేయించడంపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ టూర్ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ఖర్చులో కలపనున్నట్లు సీఈవో తెలిపారు.
ఇక ఈవీఎం బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ లో షిప్ గుర్తుకు బదులు బోటులో మనిషి ఉన్న గుర్తును చౌటుప్పల్ ఎమ్మార్వో ముద్రించారు. దీంతో దాన్ని తొలగించి, మళ్లీ సరైన గుర్తును ముద్రించారు. ఇందుకు బాధ్యుడైన చౌటుప్పల్ ఎమ్ఆర్వోను సీఈవో సస్పెండ్ చేశారు. అలాగే బ్యాలెట్ ముద్రణలో పాల్గొన్న ఇతర అధికారుల నుంచి వివరణ కోరారు. ఆ వ్యక్తికి షిప్ గుర్తును కేటాయిస్తూ సీఈవో నిర్ణయం తీసుకున్నారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు