యువతకు అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్రం కృషి

యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాల పరిస్థితులు అంత బాగా ఏమీ లేవని, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్య శిఖర స్థాయిలో ఉందని పేర్కొన్నారు. వందేళ్లకోసారి వచ్చే మహమమ్మారి ప్రభావం 100 రోజుల్లో అంతం కాబోదని చెప్పారు. 
 
10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చే రోజ్‌గార్ మేళాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. 75 వేల మంది ప్రభుత్వ ఉద్యోగార్థులకు నియామక లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రభావం మన దేశంపైనా, ప్రపంచ దేశాలపైనా ఏ విధంగా ఉందో వివరించారు.
ఈ మహమ్మారి తర్వాత అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల దెబ్బ మన దేశంపై తక్కువగా ఉండేలా చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు.  యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు.
అంతర్జాతీయ పరిస్థితి అంత బాగా ఏమీ లేదనేది వాస్తవమని చెప్పారు. చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు సైతం అత్యధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలతో సతమతమవుతున్నాయని తెలిపారు. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ప్రభావం అన్ని దేశాలపైనా ఉంటోందని పేర్కొన్నారు.
ఈ సమస్యల ప్రభావం పడకుండా మన దేశాన్ని కాపాడుకోవడం కోసం భారత దేశం అనేక నూతన చర్యలను చేపడుతోందని, కొన్ని రిస్క్‌లను కూడా చేస్తోందని తెలిపారు. మన దేశంపై ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘‘ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారం, మీ (ప్రజల) ఆశీర్వాదంతో మనం ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాం’’ అని చెప్పారు.
 
మోదీకి విజన్ ఉంది : నడ్డా 
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఉద్యోగ మేళా కార్యక్రమంలో మాట్లాడుతూ, తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2047నాటికి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన విజన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్నట్లు తెలిపారు.
రక్షణ రంగ పరికరాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను పరిశీలించినపుడు ప్రపంచంలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు మన దేశంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. మోదీ దూరదృష్టి వల్ల ఈ సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అంతకుముందు మోదీ ఎలక్ట్రానిక్ విధానంలో 75 వేల మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో వీరు పని చేస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. 
 
కాగా,  రోజ్ గార్ మేళాలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవియా, అనురాగ్ ఠాకూర్, పీయుష్ గోయల్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో యువతకు నియామక లేఖలను అందజేశారు.