హిందువులపై తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష?

తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై రోజురోజుకు వివక్ష పెరిగిపోతుందని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ఈ నెల 16వ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలలో హిందూ మహిళలను ఘోరంగా అవమానించారని పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష సమయంలో హిందువులపై అడుగడుగునా వివక్ష కనబడిందని ధ్వజమెత్తారు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు హిందూ మహిళల మెడలో ఉన్న తాళిబొట్లను,
 
చెవి రింగులను, ముక్కుపుడకలను, గాజులను, కాళ్ల పట్టీలను ఉద్దేశపూర్వక తొలగించి పరీక్షా సమయంలో వేదనకు గురి చేశారు. అదే సమయంలో వేరే మతస్తులు హిజాబ్, బుర్కా ధరించి వచ్చినా, కనీసం వారిని నామమాత్రంగా కూడా తనిఖీ చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యలో భాగమేనని విశ్వహిందూ పరిషత్ విమర్శిస్తోంది.
వాస్తవానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆర్నమెంట్ అంటే.. నగల విషయంలో ఎటువంటి నిబంధన లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ వివక్షకు గురి చేశారు. పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో మానసికంగా ఇబ్బంది గురి చేశారని పరిషత్ మండిపడింది.
 
కాబట్టి ఇలాంటి సంఘటనలకు బాధ్యులైన అధికారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ ను కలిసి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం ఫిర్యాదు చేసింది.
 
భవిష్యత్తులో నిర్వహించే ఎలాంటి పరీక్షల కైనా ఇటువంటి వివక్షలు కొనసాగరాదని సూచించింది. విశ్వహిందూ పరిషత్ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన అనితా రామచంద్రన్ మాట్లాడుతూ  ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయో చెప్పాలని కోరారు. ఆ వివరాలన్నీ కూడా ఆధారాలతో సహా వారికి పరిషత్ నేతలు అందజేశారు. 
 
అయితే మొట్టమొదట బుధవారం ఉదయం టీఎస్ పీఎస్సీ చైర్మన్ అపాయింట్మెంట్ కోరిన విశ్వహిందూ పరిషత్ నాయకులకు అధికారులు సరిగ్గా స్పందించలేదు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి వస్తే నిరాకరిస్తారా..? హిందూ సమాజమంతా ఆందోళనకు దిగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో టిఎస్ పీఎస్సి ప్రాంగణమంతా వందల సంఖ్యలో పోలీసులు నిండిపోయారు.
 
తర్వాత అపాయింట్మెంట్ అధికారులే ఖరారు చేశారు. విశ్వహిందూ పరిషత్ బృందం వచ్చేసి తమ సమస్యలు చెబితే వినడానికి సానుకూలంగా ఉన్నామని ఆ కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. విశ్వహిందూ పరిషత్ బృందం వచ్చి వెళ్లే వరకు పోలీసుల పర్యవేక్షణలోనే ఆ ప్రాంతమంతా ఉండింది. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మాతృ శక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి పద్మశ్రీ, సౌభాగ్య లక్ష్మి తదితరులు టిఎస్ పీఎస్సి కార్యదర్శిని కలిసిన వారిలో ఉన్నారు.