మద్య నిషేధం అమలు వైఫల్యంపై నితీష్‌కు హైకోర్టు అక్షింతలు

బీహార్‌‌లో మద్యపాన నిషేధ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో నితీష్‌కుమార్ సర్కార్‌ వైఫల్యాన్ని పాట్నా హైకోర్టు ఎండగట్టింది. ఇందువల్ల ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
 
ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్ల కల్తీ మద్యం మృతులు, డ్రగ్స్‌కు అలవాటుపడుతున్న వారు పెరగడం, సీజ్ చేసిన మద్యం బాటిళ్లను తగినవిధంగా ధ్వంసం  చేయకపోవడం వల్ల పర్యవారణ సమస్యలు తలెత్తడం వల్ల ప్రతికూల ప్రభావాలు చోటుచేసుకుంటున్నట్టు జస్టిస్ పూర్ణేంద్ర సింగ్‌‌తో కూడిన ఏకసభ్య బెంచ్ అభిప్రాయపడింది.
 
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై నితీష్ కుమార్ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో నిషేధం విధించింది. దీనికి ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నితీష్ కుమార్ రాష్ట్రంలోని మహిళలకు మద్యనిషేధంపై హామీ ఇచ్చారు. ప్రొహిబిషన్ సంబంధిత కేసులో గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్న ముజఫర్‌పూర్ జిల్లా నివాసి నీరజ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి తాజా వ్యాఖ్యలు చేశారు.\”ఎప్పటికప్పడు సవరించుకుంటూ వెళ్తున్న బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం-2016ను సమర్ధవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం వల్ల రాష్ట్ర ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని కోర్టు అభిప్రాయపడుతోంది. మద్యనిషేధం తర్వాత పెద్ద సంఖ్యలో కల్తీమద్యం మృతుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీమద్యం సేవించి జబ్బు పడిన వారి చికిత్స కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటాకాల్‌ను అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం మరింత విచారకరం” అని అక్టోబర్ 12న ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు స్పష్టం చేసింది.
కల్తీ మద్యంతో పాటు అక్రమ మాదకద్రవ్యాల వినియోగం పెరగడంపై కూడా కోర్టు నిశిత వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో నార్కోటిక్స్  అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ప్రభుత్వ విఫలమైందని ఆక్షేపణ చేసింది. మద్యనిషేధం తర్వాత చరస్, గంజా, భంగ్ వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోందని, దీనికి బానిసలవుతున్న వారిలో ఎక్కువ మంది 25 ఏళ్ల లోపువారేనని, కొందరు పదేళ్ల వాళ్లు కూడా ఉంటున్నారని తెలిపింది.

అధికారుల అవినీతిని కూడా హైకోర్టు ఎత్తిచూపింది. లిక్కర్ బ్యాన్ అంటే తమకు ఆదాయం వచ్చే పంటగా పోలీసులు, ఎక్సైజ్, రవాణా శాఖలు భావిస్తున్నట్టు కనిపిస్తోందని, పేద ప్రజలపై నమోదు చేస్తున్న కేసులతో పోలిస్తే ఇలాంటి అక్రమాలతో ప్రమేయమున్న బడాబాడులు, సిండికేట్ ఆపరేటర్లపై నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. మద్యపాన నిషేధ చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో మెజారిటీ ప్రజలు పేదలు, తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా నిలుస్తున్న రోజువారీ కూలీలేనని కోర్టు అభిప్రాయపడింది.

అయితే, క్రష్ చేసిన మద్యం బాటిళ్ల నుంచి గాజులు తయారు చేసేందుకు ఒక వినూత్న పాలసీ తేవడంపై బీహార్ సర్కార్‌ను అభినందించింది. లిక్కర్ బాటిళ్లు ధ్వంసం చేసేటప్పుడు ఆయా ప్రాంతాల్లో భూసారం, అండర్ గ్రౌండ్ వాటర్ నాణ్యత తగ్గకుండా చూసేందుకు పర్వావరణ హిత విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది.