గ్యాంగ్‌స్టర్లలతో కబడ్డీ ప్రమోటర్‌ ఇండ్లలో ఎన్ఐఎ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. గ్యాంగ్‌స్టర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్లపై దాడులు నిర్వహించారు. వీరితో పాటు పలుగురు గ్యాంగ్‌స్టర్ల ఇండ్లతో పాటు కబడ్డీ ఆటకు ప్రమోటర్‌గా ఉన్న ప్రముఖుడి నివాసంలో కూడా ఎన్‌ఐఏ సోదాలు చేసింది.
 
సోదాల సందర్భంగా పలు డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీన పర్చుకున్నారు. గత నెల 12 న ఫాజిల్కా జిల్లాలోని దుత్తరావలి గ్రామంలోని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నివాసంలో కూడా ఎన్‌ఐఏ సోదాలు చేసింది. అలాగే, కెనడాలో స్థిరపడిన గ్యాంగ్‌స్టర్‌ సత్వీందర్‌సింగ్‌ ఇంటిపై కూడా దాడులు జరిగాయి.
 
గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌ప్రీత్‌ బుడ్డా గ్రామంలో కుస్సా వద్ద, మొగాలోని దున్నెకె గ్రామంలో, ఫరీద్‌కోట్‌ జిల్లా పరిధిలోని కోట్కాపురాలోని గ్యాంగ్‌స్టర్‌ వినయ్‌ దేవ్‌రా నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. తెల్లవారు జాము నుంచే సోదాలు ప్రారంభమయ్యాయని, సోదాల సందర్భంగా పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఉగ్రవాదులతో గ్యాంగ్‌స్టర్లకు సంబంధాలు ఉన్నాయనే పక్కా సమాచారం మేరకు ఎన్‌ఐఏ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తున్నది. మొహలీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఆర్‌పీజీ దాడుల తర్వాత ఉగ్రవాదులతో సంబంధాలపై అనుమానాలు పెరిగిపోయాయి. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పలు బ్యాంకు అకౌంట్ల వివరాలు, గ్యాంగ్‌స్టర్ల ఆస్తులు, వారికి సహకరించిన వ్యక్తులకు సంబంధించిన పత్రాలపై ఎన్‌ఐఏ బృందాలు విచారణ జరుపుతున్నాయి. రేవారి, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఝజ్జర్, నార్నాల్, రోహ్‌తక్‌లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.