మహిళల ఆసియా కప్ టీ20 విజేత భారత్

అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంకను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 66 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు.  8 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై టీమిండియా జట్టు గెలుపొందింది.

ముఖ్యంగా స్టార్‌ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మందాన చెలరేగి ఆడింది. కేవలం 25 బంతుల్లో 51 పరుగులు చేసి శెభాష్ అనిపించుకుంది. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో లంక బౌలర్ల దుమ్ముదులిపి నాటౌట్‌గా నిలిచింది. దీంతో కేవలం 8.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఏడోసారి ఆసియా కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది.

మిగతావారిలో షఫాలీ వర్మ (5), రోడ్రిగేజ్ (2), హర్మాన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీరా, కవిశఆ దిల్హరి చెరో వికెట్ తీశారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి శ్రీలంక బ్యాట్స్‌ఉమెన్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా సమష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్లను బెంబేలెత్తించారు.

దీంతో ప్రత్యర్థి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్‌కు 66 పరుగుల సునాయాస లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్‌ఉమెన్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తొలి ఆరుగురిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు దాటలేకపోయాడు.

18 పరుగులు చేసిన రణవీర టాప్ స్కోరర్‌గా నిలిచింది. 13 పరుగులతో రణసింఘే సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్లు ఇద్దరూ రనౌట్‌గా వెనుదిరిగారు.

భారత బౌలింగ్: రేణుకా సింగ్ 3 వికెట్లు, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు చొప్పున తీశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీలంక ఓపెనర్లు ఇద్దరూ రనౌట్‌గా వెనుదిరిగారు.

శ్రీలంక బ్యాటింగ్: చమరి ఆటపట్టు(6), అనుష్క సంజీవనీ(2), హర్షితా మాధవి (1), నిలాక్షి డిసిల్వా (6), హాసిని పెరీరా (0), కవిశా దిల్హరి (1), ఒశాదీ రణసింఘే (13), మల్షా షెహనీ (0), సుగండికా కుమారీ (6), ఇనోకా రణవీరా (18 నాటౌట్), అచినీ కులసుప్రియా (6 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.