తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌-స్టేడ్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వివరాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రూ.1082.56 కోట్లతో 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం కానుందని తెలిపారు. ఇది ప్రపంచంలో రెండో, దేశంలో మొదటి ఐకానిక్‌ కేబుల్‌-స్టేడ్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి కానుంది. 

బ్రిడ్జిలో పాదచారుల కోసం గాజు మార్గం ఉండనుందని ఆయన చెప్పారు. బ్రిడ్జికి పైలాన్‌ గోపురం, లైటింగ్‌, పెద్ద నావిగేషనల్‌ స్పాన్‌ వంటి ప్రత్యేకతలు ఉంటాయని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్‌-తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుందని తెలిపారు. బ్రిడ్జి తెలంగాణ వైపు లలిత సోమేశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్‌ వైపున సంగమేశ్వరం ఆలయం ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూడొచ్చని వివరించారు. 

వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని తెలిపారు.  తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఏపీకి నేరుగా వెళ్లాలంటే పడవలో ప్రయాణించాల్సిందే. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు అవుతుంది.  ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు.

 కాగా, సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి – కోడూరు సెక్షన్‌ నుండి ఇప్పటికే ఉన్న రెండు లైన్ల రోడ్‌ను ఎన్‌ హెచ్‌ -342లోని నాలుగు లైన్లగా మార్పుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రూ.1,318.57 కోట్ల ఖర్చుతో ఈపిసి పద్దతిలో 47.65 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. రెండేళ్ల కాలంలో రోడ్డు ఆధునీకరణ పనులు పూర్తి చేయనుంది.

పుట్టపర్తి, బుక్కపట్నంలకు మెరుగైన కనెక్టివిటీని నాలుగు లైన్ల రోడ్డు అందించనుంది. పుట్టపర్తిలోని అంతర్జాతీయ ఖ్యాతి గల సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలను ఈ రోడ్డు కలపనుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, వివిధ ఇతర రాష్ట్రాల ప్రజలకు, వివిధ దేశాల రోగులకు సేవలందించే ప్రపంచ స్థాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి కనెక్టివిటీని పెంచనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.