దగ్గు సిరప్ ఉదంతంపై కేంద్రం నిపుణుల కమిటీ

హరియాణాలోని మెయిడెన్‌ ఫార్మా సంస్థ దగ్గు, జలుబు నివారణ కోసం తయారు చేసిన సిరప్‌లు పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి కారణమైందన్న కథనాలపై నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో నలుగురు నిపుణులుంటారు. 
 
వీరు మెయిడెన్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల సిరప్‌ల శాంపిళ్లను పరిశీలిస్తారు. అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మెయిడెన్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల సిరప్‌ల కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమైంది. 
మెయిడెన్‌  ఫార్మాసూటికల్‌ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల ఈ సిరప్‌ల వాడకం వల్ల కిడ్నీలు దెబ్బతిని వారు చనిపోయారని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనోమ్‌ తెలిపారు. ‘దగ్గు, జలుబుకి వాడే ఈ మందులను భారత్‌లోని మెయిడెన్‌ ఫార్మా కంపెనీ తయారు చేసింది. చిన్నారుల మరణం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది’ అని పేర్కొన్నారు.
 ఈ వ్యవహారంపై ఆ సంస్థతోపాటు భారత్‌లోని ఔషధ నియంత్రణ సంస్థతో కలిపి డబ్ల్యూహెచ్‌వో విచారణ నిర్వహిస్తోందని ప్రకటించారు.  హరియాణాలోని మెయిడెన్‌ ఫార్మా సంస్థ దగ్గు, జలుబు కోసం ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మాలిన్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మెకాఫ్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌లను తయారు చేసిందని, ఈ రోజువరకు వాటి భద్రత, నాణ్యతపై తమకు హామీ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
నాలుగు హానికరమైన సిరప్‌ల వాడకం కారణంగా చిన్నారులు చనిపోయినట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ల్యాబ్‌లో ఆ మందుల శాంపిళ్లను పరీక్షించినప్పుడు.. వాటిలో మోతాదుకు మించి డైథిలీన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్‌ గ్లైకాల్‌ కలిసినట్టు గుర్తించామని వెల్లడించింది.  డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించింది.
మెయిడెన్‌ సంస్థ తయారు చేసిన సిర్‌పల శాంపిళ్లను కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ (సీడీఎల్‌)కి పంపారు. సీడీఎల్‌ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఈ కంపెనీపై చర్యలు తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.