బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందని తెలిపారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. 

మునుగోడు ఎన్నిక రాష్ట్ర, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో  ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్న ఆయన కేంద్రంలోమోదీ  చేస్తున్న అభివృద్ధిని చూసి  ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

కేటీఆర్ ఆరోపణలపై ఆగ్రహం 

కాగా,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని, అందుకు ప్రతిగా ఆయన బిజెపిలో చేరారని, ఇది క్విడ్ ప్రో కో అని తెలంగాణ మంత్రి కెటిఆర్ చేసిన ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. 

“కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్)కు బహిరంగ సవాల్ విసురుతున్నా. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై చేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు నిజమని నిరూపించు… లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు” అంటూ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, కోల్ మైన్ బ్లాక్స్ గురించి మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కమీషన్ల కోసమే తాడిచర్ల మైన్స్ ను కేసీఆర్ ప్రభుత్వం ఏఎమ్ఆర్ కు అప్పగించిందని ఆరోపించారు. ఈ మైన్ లో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.  

దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని చెబుతూ తాడిచర్ల మైన్స్ లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.  సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రాజగోపాల్  రెడ్డి కాంట్రాక్టు టెండర్స్  దక్కించుకున్నారని  ఆయన స్పష్టం చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ తప్పడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.