మజ్లిస్ను కేసీఆర్ పెంచి పోషిస్తుండు

మజ్లిస్ను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె  లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అండతోనే మజ్లిస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. శనివారం లింగాల హరిగౌడ్ ఆధ్వర్యంలో మలక్ పేటకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా లక్ష్మణ్ కేసీఆర్, ఎంఐఎంపై విమర్శలు గుప్పిస్తూ  టీఆర్ఎస్, ఎంఐఎం మైత్రి విడదీయరానిదంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై ఎంఐఎం వాళ్లు దాడులకు తెగబడుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోరని తెలిపారు. అందుకే ఇక్కడి టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ చెప్పారు. 

ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయమని, అందుకే వాళ్లు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారని ఆయన విమర్శించారు. దమ్ముంటే పాత బస్తీలో పన్నులు వసూలు చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే దమ్మున్న ఒకే ఒక పార్టీ బీజేపీ అని పేర్కొన్న లక్ష్మణ్ మజ్లిస్ ఆగడాలను ఏమాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు.

చిట్ చాట్ అంటూ కేటీఆర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై చవకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. మోహన్ భగవత్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సాహసాలు, త్యాగాల ముందు మీరెంతా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ బయలు దేరారని, కానీ ఆయన ఆటలు జాతీయ స్థాయిలో సాగబోవని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

కాగా, మలక్ పెట్ నియోజకవర్గంలో టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రజలను రాచి రంపాన పెడుతున్నాయని, అరాచకాలకు పాల్పడుతున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలకు విసిగిపోయి, ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలకు నమ్మి బీజేపీలో చేరిన లింగాల హరిగౌడ్ తదితరులకు హృదయపూర్వక స్వాగతం తెలిపారు.